ఏపీలో RRR థియేటర్ ధ్వంసం..!

Update: 2022-03-25 13:07 GMT
ఇప్పుడు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా RRR మాటే వినిపిస్తోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం.. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు.

'ఆర్.ఆర్.ఆర్' విడుదల నేపథ్యంలో మెగా - నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు - భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పూలదండలు వేసి పాలాభిషేకాలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానులు ర్యాలీలు తీయగా.. మరికొన్ని చోట్ల డప్పు చప్పుళ్లతో సందడి చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ RRR రిలీజ్ డే నాడు కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌ లో ఉదయం స్పెషల్ షో వేయగా.. సినిమా మొదలైన గంటకే సాంకేతిక కారణాలతో షో ఆగిపోయింది. సినిమా ప్రదర్శనకు అంతరాయం కలగడంతో తారక్ మరియు చరణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌ లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అభిమానుల దాడిలో థియేటర్ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ క్రమంలో కొందరిపై అద్దాలు పడి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని తెలుస్తోంది.

ఇదే థియేటర్‌‌లో అభిమానులు స్క్రీన్ దగ్గరకు వెళ్లకుండా పోడియంపై మేకులు బిగించి ఇనుప కంచెను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఒంగోలులోని ఓ థియేటర్ వద్ద RRR హీరోల ఫ్యాన్స్ మధ్య టిక్కెట్ల వివాదం నెలకొంది.

స్థానిక థియేటర్ లో టికెట్స్ విషయంలో ఇరు వర్గాల అభిమానుల మధ్య కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ హీరో ఫ్యాన్స్ తమకే ఎక్కువ టిక్కెట్స్ ఇవ్వాలని పట్టుపట్టడంతో మరో హీరో అభిమానులు గొడవకు దిగారని తెలుస్తోంది.

హీరోల ఫ్యాన్స్ బాహాబాహీకీ దిగడంతో థియేటర్‌లో తలుపుతో పాటు అద్దాలకు అమర్చిన హ్యాండిళ్లను ధ్వంసమైనట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారికి సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మమతా థియేటర్ యాజమాన్యం - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. కావాలనే టార్గెట్ చేసి యాజమాన్యం టికెట్స్ ఇవ్వడం లేదని తారక్ అభిమానులు ఆరోపించారు. ఇది పరస్పర దాడుల వరకు వెళ్ళింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుమణిగింది.
Tags:    

Similar News