క్రేజీ కాంబో: మెగాస్టార్ తో ఊర మాస్ డైరెక్టర్..?

Update: 2020-10-24 15:38 GMT
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరు.. మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు తమిళ్ హిట్ సినిమా 'వేదలమ్' ని కూడా మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారని సమాచారం. అలానే బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. అయితే ఇప్పుడు ఈ లైన్లో ఊర మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, చిరంజీవి - బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా రానుందని ఎప్పటి నుంచో అంటున్నారు. చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత బోయపాటితో వర్క్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అన్నారు. అయితే అదే సమయంలో కొరటాల శివ చెప్పిన స్టోరీ నచ్చడంతో 'ఆచార్య' కు కమిట్ అయ్యాడు. అందులోనూ బోయపాటి రామ్ చరణ్ తో 'వినయ విధేయ రామ' సినిమా చేసి ప్లాప్ మూటగట్టుకోవడంతో మళ్ళీ చిరు - బోయపాటి కాంబో గురించి అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం బోయపాటి బాలయ్య సినిమాపై ద్రుష్టి పెట్టాడు. అయితే బోయపాటి మాత్రం చిరు పై ఆశ‌లు పెట్టుకొని అదే స్క్రిప్ట్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు బ్యాన‌ర్‌ లో ఓ సినిమా కమిట్ అయిన బోయపాటి.. చిరుతో చేయబోయే ప్రాజెక్ట్ దిల్ రాజు నిర్మాణంలోనే చేయనున్నాడట. మరి ఈ వార్తలు నిజమై ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News