నిర్మాతలకు ఈమధ్య డిజిటల్ రైట్స్ ఒక మంచి ఆదాయ వనరుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ అయిన నాలుగైదు వారాల్లోపే సినిమాలు అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రంగస్థలం, మహానటి లాంటి సినిమాలు 50 రోజుల లోపే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'RX 100' కూడా ఆ లిస్టు లో చేరింది.
కార్తికేయ - పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్ హీరోయిన్లు గా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన 'RX 100' బాక్స్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో యూత్ ను మెప్పించిన ఈ సినిమా పై కొంతమంది విమర్శలు కూడా చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధం లేకుండా పెట్టుబడికి నాలుగైదు రెట్లు కలెక్షన్స్ తీసుకొచ్చి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఈ చిత్రం.
ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా ఐదువారాలు కూడా కాకమునుపే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులోకి వచ్చింది. 'RX 100' ఎలాగూ అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు అమెజాన్లో ప్రదర్శించినా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ రాబోయే రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇంతకంటే ముందే సినిమాలు ప్రదర్శిచే ట్రెండ్ మాత్రం మొదలయ్యేలా ఉంది. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలను త్వరగా ప్రదర్శిస్తుండడం పై చర్చలు జరుగుతున్నాయి.