సాయిపల్లవి ఫ్యాన్స్ గగ్గోలు

Update: 2019-06-02 04:27 GMT
కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ విషయంలో సాయిపల్లవి ఎప్పుడూ దృష్టిపెట్టింది లేదు. ముఖంపై మొటిమలతోనే ‘ప్రేమమ్’ చిత్రంలో నటించింది. ఆ సహజత్వమే ఆ పాత్రకు మరింత అందం తెచ్చింది. కోట్లాది మంది ప్రేక్షకులకు సాయిపల్లవిని చేరువ చేసింది. ఇక ఆమె యాక్టింగ్ టాలెంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. గ్లామర్ హీరోయిన్లలో ఉండే ఫీచర్లు పెద్దగా లేకపోయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు - ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుందామె. పాత్రలు ప్రత్యేకంగా ఉంటుండటం - నటిగా మంచి మార్కులు పడుతుండటంతో గ్లామర్ మీద ఎప్పుడూ అంతగా దృష్టిపెట్టాల్సిన అవసరం సాయిపల్లవికి లేకపోయింది. కానీ సినిమా తేలిపోతే - పాత్ర బాలేకుంటే ఆమె లుక్స్ మీద ఆటోమేటిగ్గా ప్రేక్షకుల దృష్టి పడుతుందనడంలో సందేహం లేదు. ‘ఎన్జీకే’ విషయంలో అదే జరుగుతోంది.

శుక్రవారం విడుదలైన ‘ఎన్జీకే’ విషయంలో సాయిపల్లవి చాలా ఎగ్జైట్ అవుతూ వచ్చింది ముందు నుంచి. తన అభిమాన నటుడైన సూర్యతో కలిసి నటించడమే అందుక్కారణం. ఇందులో ఆమె సూర్యకు భార్యగా నటించింది. సాయిపల్లవి కెరీర్ లో అత్యంత చెత్త సినిమా ఇదే అనడంలో మరో మాట లేదు. ఆమె చేసిన అత్యంత పేలవమైన పాత్ర కూడా ఇందులోనిదే. ఏ ప్రత్యేకతా లేని ఆ పాత్రను ఆమె ఎలా ఒప్పుకుందో మరి. సూర్య హీరో - సెల్వరాఘవన్ డైరెక్షన్ అనేసరికి కథ - పాత్ర వినకుండానే చేసేసిందేమో. ఎన్నో అంచనాలతో సినిమాకు వెళ్లిన సాయిపల్లవి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె పాత్ర తేలిపోగా.. అంతకుమించి లుక్ పేలవంగా కనిపించింది. పాత్ర బాలేకపోవడంతో ఆమె లుక్ మీద లుక్కేశారు జనాలు. సాయిపల్లవే కేర్ తీసుకోలేదో.. దర్శకుడి సూచనల మేరకు అలా కనిపించిందో కానీ.. ఆమె చూడ్డానికి ఏమీ బాగాలేదు. కొన్ని సీన్లలో సాయిపల్లవిని చూడటమే కష్టమై - ఆమె స్క్రీన్ నుంచి పక్కకు వెళ్లిపోతే బెటర్ అనుకునే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇకముందు సాయిపల్లవి పాత్రలతో పాటు లుక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ గట్టిగా అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News