అలాంటి క‌థ‌ల‌పై సాయి ప‌ల్ల‌వి మోజు ప‌డుతోందా?

Update: 2022-06-14 11:30 GMT
ప్రముఖ ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ 'ఫిదా'తో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సాయి ప‌ల్ల‌వి.. తొలి ప్ర‌య‌త్నంలోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువై కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసిన ఈ న్యాచుర‌ల్ బ్యూటీ.. అందం, అభిన‌యం, అంత‌కు మించిన ట్యాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ఓవైపు హీరోయిన్లు అందాల‌ ఆర‌బోత‌లో హ‌ద్దులు మీరుతున్నా.. సాయి ప‌ల్ల‌వి మాత్రం గ్లామ‌ర్ షోకు, చిట్టి పొట్టి బ‌ట్ట‌ల‌కు దూరంగా ఉంటూ న‌ట‌న‌కే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తోంది.

దాంతో ఆమెను అభిమానించే వారి సంఖ్య అంత‌కంత‌కు పెరిగిపోతోంది. ఇక‌పోతే ఇటీవ‌ల 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ‌రాయ్‌' చిత్రాల‌తో వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఇప్పుడు 'విరాట ప‌ర్వం'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ చ‌క్క‌టి ప్రేమ క‌థ‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి హీరోగా న‌టించ‌గా, వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంత‌రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సాయి ప‌ల్ల‌వి.. సినిమా గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది.

అలాగే ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో ఉన్న ఓ కొత్త కోరిక‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' లాంటి పౌరాణిక సినిమాలంటే మ‌హా ఇష్ట‌మ‌ని, అలాంటి పౌరాణిక చిత్రాల్లో న‌టించాల‌నే కోరిక ఎప్ప‌టి నుంచో ఉంద‌ని సాయి ప‌ల్ల‌వి పేర్కొంది. అంతేకాదు, రన్నింగ్‌ అంటే కూడా త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఆ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి పౌరాణిక క‌థ‌లు, రన్నింగ్‌ అథ్లెట్స్ కథల‌పై సాయి ప‌ల్ల‌వి మోజు ప‌డుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి అలాంటి క‌థ‌ల‌తో సాయి ప‌ల్ల‌వి వ‌ద్ద‌కు ఎవ‌రైనా వెళ్తే.. ఆమె అంగీక‌రించే అవ‌కాశాలు ఎంతైనా ఉన్నాయి. కాగా, ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి చేతిలో 'గార్గి' అనే ప్రాజెక్ట్ ఉంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ దీనిని రూపొందిస్తున్నారు.
Tags:    

Similar News