యుఎస్ బాక్సాఫీస్ వెలవెల

Update: 2018-07-30 08:26 GMT
‘మహానటి’ సినిమా వచ్చి మూడు నెలలు కావస్తోంది. ఆ సినిమా ప్రభంజనం సృష్టించాక యుఎస్ తెలుగు బాక్సాఫీస్‌ లో కదలిక తెచ్చే సినిమానే రాలేదు. ‘సమ్మోహనం’.. ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. ఊపు తేలేకపోయాయి. ప్రతి వారం రెండు మూడు సినిమాలు రిలీజవుతున్నాయే కానీ.. పెద్దగా ప్రభావం చూపించట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన వసూళ్లు సాధించిన ‘ఆర్ ఎక్స్ 100’ సైతం అమెరికాలో తుస్సుమనిపించింది. నామమాత్రంగా వసూళ్లు రాబట్టింది.

గత శుక్రవారం విడుదలైన రెండు సినిమాలైనా సత్తా చాటుతాయనుకుంటే.. అవి కూడా నిరాశనే మిగిల్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సాక్ష్యం’ అక్కడ తేలిపోయింది. ఈ చిత్రానికి యుఎస్ లో ప్రిమియర్స్ కూడా వేయలేదు. శుక్రవారం నేరుగా సినిమాను రిలీజ్ చేయగా.. ఆ రోజు 43 వేల డాలర్లతో పర్వాలేదనిపించింది. కానీ తర్వాతి రోజుకు వసూళ్లు 31 వేల డాలర్లు పడిపోయాయి. ఆదివారం వసూళ్లలో మరింత డ్రాప్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక శనివారం విడుదలైన ‘హ్యాపీ వెడ్డింగ్’కు ముందు రోజు ప్రిమియర్లు వేయగా.. 12 వేల డాలర్లే వసూలయ్యాయి. శనివారం 13 వేల డాలర్లొచ్చాయి. ఆదివారం వసూళ్లు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ‘సాక్ష్యం’కు అనేక ఆకర్షణలున్నప్పటికీ.. యుఎస్ ప్రేక్షకుల అభిరుచికి తగని సినిమా కాకపోవడం ప్రతికూలమైంది. ‘హ్యాపీ వెడ్డింగ్’ అక్కడి జనాల టేస్టుకు తగ్గదే కానీ.. సినిమా మరీ స్లో కావడం నెగెటివ్ అయింది. రెండు సినిమాలూ అక్కడ బయ్యర్లకు నష్టాలు మిగల్చడం ఖాయమని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాలకు ఆశించిన ఫలితం దక్కట్లేదు. రెండూ ఫ్లాపులే అని తేలిపోయింది.
Tags:    

Similar News