నయన్ విషయంలో కరణ్ పై కారాలు .. మిరియాలు!

Update: 2022-07-26 04:31 GMT
కథాకథనాల పరంగా .. సాంకేతికత పరంగా భారీ సినిమాలు తాము మాత్రమే తీయగలము, ప్రయోగాలు .. సాహసాలు గట్రా తామే చేయగలము అనే ఒక ధోరణి మొదటి నుంచి కూడా బాలీవుడ్ మేకర్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే కోలీవుడ్ నుంచి శంకర్ .. టాలీవుడ్ నుంచి రాజమౌళి రంగంలోకి దిగిన తరువాత సీన్ మారిపోయింది. ప్రపంచ సినీ పరిశ్రమ ఇప్పుడు సౌత్ ఇండియా వైపు చూస్తోంది. ఇక్కడి మేకింగ్ మాత్రమే కాదు .. నటీనటుల క్రేజ్ కూడా ఎల్లలు దాటిపోయింది. ఏ సెలబ్రిటీ ఎక్కడ ఎలా స్పందించినా పబ్లిక్ తమ అభిప్రాయాలను చెప్పగల సౌకర్యం వచ్చేసింది.

అందువల్లనే చాలామంది ఇప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మాట్లాడుతున్నారు. రేటింగ్స్ పెంచుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడటానికి ట్రై చేస్తే మాత్రం ట్రోల్స్ బారిన పడుతున్నారు. అలాంటి ఒక పరిస్థితి తాజాగా కరణ్ జొహార్ కి ఎదురైంది. 'కాఫీ విత్ కరణ్' అనే షో ద్వారా ఆయన అడిగే ప్రశ్నలు .. వెల్లడించే అభిప్రాయాలు వివాదాలను .. విమర్శలను తెచ్చిపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మనసులో తాను అనుకున్న విషయాన్ని చాలా తేలికగా బయటపెట్టేస్తూ, షోలో పాల్గొన్నవారు తడుముకునేలా చేయడం ఆయన ప్రత్యేకత.

అలా తాజాగా సమంత - అక్షయ్ కుమార్ పాల్గొన్న ఎపిసోడ్ లో నయనతార గురించి కరణ్ మాట్లాడిన ఒక మాటకి ఆయనను ఇప్పుడు ఒక  రేంఙ్ లో ఆడేసుకుంటున్నారు. ఈ షోలో సమంత మాట్లాడుతూ .. సౌత్ ఇండియాలోనే పెద్ద స్టార్ అనిపించుకున్న నయనతారతో కలిసి నటించే అవకాశం తనకి లభించిందని చెప్పింది.

దాంతో ఆమె అంత పెద్ద స్టార్ గా తాను అనుకున్న లిస్ట్ లో అయితే లేదు అని కరణ్ అన్నారు. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిన సమంత ఏమనాలో అర్థంకాక ఒక  చిన్న  స్మైల్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ మాట పట్టుకునే కరణ్ పై కామెంట్స్ దాడి జరుగుతోంది.

'సౌత్ ఇండియా వాళ్లతో పెట్టుకోవద్దు .. వెళ్లి పనిచూసుకో' అని కొంతమంది కామెంట్స్ పెడితే, 'మీలాంటివారి లిస్టులో  నయనతార వంటి గొప్ప ఆర్టిస్ట్ పేరు లేకపోవడమే బెటర్' అంటూ మరికొంతమంది ఎదురుదాడి చేస్తున్నారు. నయనతార గురించి మీకు ఏం తెలుసనీ .. అలాంటి ఆర్టిస్టులు మీ బాలీవుడ్ లో ఉన్నారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజం చెప్పాలంటే తొలినాళ్లలో గ్లామర్ పరంగానే మెరిసిన నయనతార, ఆ తరువాత నటన ప్రధానమైన పాత్రలను చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. సౌత్ ఇండియాలోనే అలాంటి ఆర్టిస్ట్ లేదనేవారు ఎంతోమంది ఉన్నారు. ఆమె తన లిస్ట్  లో లేరంటూ కరణ్ తీసిపారేయడమే ఇలా కారాలు .. మిరియాలు నూరడానికి కారణమైంది.
Tags:    

Similar News