రాజీ పాత్ర‌లో ఎమోష‌న్ గురించి ఓపెనైన సామ్

Update: 2021-06-06 03:30 GMT
వివాదాలు కొన‌సాగుతున్నా..దాంతో సంబంధం లేకుండా `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న  సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూసిన థ్రిల్లింగ్ సిరీస్ ఇది. మొద‌టి భాగం కంటే రెండో భాగం మ‌రింత థ్రిల్ కి గురి చేసిందంటూ అభిమానులు మొద‌టి రోజే ట్వీట్ రివ్యూలు ఇచ్చారు.

సీజ‌న్ 2లో స‌మంత పాత్ర ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఈలం రెబ‌ల్ రాజీ పాత్ర‌లో సామ్ అద్భుతంగా న‌టించార‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. రాజ్ నిడిమోరు - కృష్ణ డికె సృష్టించిన ఈ సిరీస్ లో టాస్క్ అధికారి శ్రీకాంత్ తివారీగా తన పాత్రను తిరిగి పోషించిన మనోజ్ బాజ్‌పేయి గొప్ప న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. శ్రీలంక తమిళ విముక్తి సమరయోధురాలు రాజీ పాత్రను పోషించిన సమంత మ‌రో లెవ‌ల్లో న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేశారు.

రాజీ పాత్రలో సున్నితత్వం సమతుల్యత అవసరమని నా ద‌ర్శ‌కుల‌కు  తెలుసు. ద్వేషం అణచివేత దురాశపై పోరాటానికి మనుషులుగా కలిసి రావడానికి పూర్తిగా అవసరమైన రిమైండర్ ఈ పాత్ర అని సామ్ అన్నారు. సమీక్షలు వ్యాఖ్యలను చదివాక నా హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది. రాజీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. రాజ్ అండ్ డికే ఆ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు ఏం అవ‌స‌ర‌మో నాకు తెలుసు. సృజనాత్మక ర‌చ‌నా బృందం ఈలం యుద్ధంలో త‌మిళ మహిళల కథలతో పోరాటాల‌కు సంబంధించిన డాక్యుమెంటరీలను పంచుకుంది. నేను ఆ డాక్యుమెంటరీలను చూసినప్పుడు ఈలం తమిళులు సుదీర్ఘకాలం అనుభ‌వించిన‌ ఇబ్బందులు అంతులేని దుఃఖం చూసి నేను భయపడ్డానని సామ్ అన్నారు.

ఈలం మ‌హిళ‌ల‌ డాక్యుమెంటరీలకు కొన్ని వేల వీక్షణలు మాత్రమే ఉన్నాయి. 10వేల‌ మంది ఈలం ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయినప్పుడు ప్రపంచం ఏం చేసిందో తెలిసింది. లక్షలాది మంది తమ జీవనోపాధిని ఇళ్లను కోల్పోయారు. లెక్కలేనంత‌ మంది  దూరప్రాంతాలకు వెళ్లారు. కలహాల గాయాలు వారి హృదయాల్లో  మనస్సులలో ఎప్ప‌టికీ తాజాగా ఉన్నాయి అని స‌మంత‌ తెలిపారు.

రాజీ కథ ..యుద్ధం తో బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవించే వారికి నివాళి. రాజీ కథ కల్పితమైనప్పటికీ అది ఎంతో సున్నితమైన గొప్ప జ్ఞాప‌కం అని సామ్ అన్నారు.
Tags:    

Similar News