తేలిపోయిన సామ్రాట్.. 4 వారాల‌కే OTT లో

Update: 2022-06-12 02:30 GMT
దేశంలో సూప‌ర్ స్టార్లు అంటే బాలీవుడ్ స్టార్లు మాత్ర‌మే. హిందీ స్టార్ల చ‌రిష్మా ముందు ఇంకే స్టార్ నిల‌బ‌డ‌లేడు. అమితాబ్ .. షారూక్.. స‌ల్మాన్.. అమీర్ ఖాన్ .. అక్ష‌య్ .. హృతిక్ .. అంటూ కొన్ని పేర్లు నిరంత‌రం వినిపిస్తుండేవి. కానీ ఇక‌పై వీళ్ల ప‌ప్పులేవీ ఉడ‌క‌వ‌ని వాళ్ల‌కే ప్రాక్టిక‌ల్ గా అర్థ‌మ‌వుతోంది.

ట్రెండ్ అనూహ్యంగా మారిపోయింది. దేశంలో పాన్ ఇండియా ట్రెండ్ రాజ్య‌మేలుతోంది. ఇప్పుడు ప్ర‌జ‌ల చూపు కేవ‌లం పాన్ ఇండియా స్టార్ల‌పైనే. అది ఏ భాష నుంచి వ‌చ్చిన స్టార్ అయినా కంటెంట్ బావుంటే ఆద‌రించేందుకు ప్రాంతీయ భేధాలు అడ్డురావ‌డం లేదు. ఈ విష‌యాన్ని బాహుబ‌లి మొద‌లు ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 - పుష్ప వ‌ర‌కూ ప్ర‌తి తెలుగు సినిమా నిరూపించాయి. సౌత్ నార్త్ అనే తేడాను త‌గ్గించ‌డంలో మ‌న సినిమాలు పెద్ద ప్ర‌భావం చూపాయి.

అయితే బాలీవుడ్ నుంచి ఇంకా ఏదైనా మ్యాజిక్ జ‌రుగుతుంద‌ని అంతా ఆశించారు. కానీ అది ఇప్ప‌ట్లో క‌నిపించేట్టు లేదు. ఇటీవ‌ల విడుద‌లైన అక్షయ్ కుమార్  సామ్రాట్ పృథ్వీరాజ్ దారుణ ప‌రాజ‌యంతో ఇది ఖాయ‌మైంది. ఈ సినిమా య‌ష్ రాజ్ బ్యాన‌ర్ లో తెర‌కెక్కి అత్యంత‌ డిజాస్ట‌ర్ మూవీగా నిలిచింది. భారతదేశంలో ఈ మూవీ జీవితకాల కలెక్షన్లు రూ. 65 కోట్లు. ఇది ఒక పెద్ద ఫ్లాప్ అని నిరూప‌ణ అయ్యింది. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ బృందం డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లో ఉంది. సామ్రాట్ ను కేవలం 4 వారాల్లో OTT ప్రీమియర్ కి తీసుకు రావ‌డం ద్వారా నష్టాలను తగ్గించడానికి YRF గేమ్ ప్లాన్ ని సిద్ధం చేసింది.

ఒక‌ర‌కంగా ముందస్తు ప్రీమియర్ ని ఎంచుకోవ‌డం వెన‌క మ‌త‌ల‌బు ఉందనేది తాజా గుస‌గుస‌. నిజానికి 2022 లో స‌ద‌రు సంస్థ నుంచి విడుద‌ల‌య్యే సినిమాల‌కు ఓటీటీలతో ఒక విభిన్న‌మైన ఒప్పందం అమల్లో ఉంది.  సినిమాల రేంజును బ‌ట్టి 4 వారాలు - 8 వారాల పాటు ధరలను లాక్ చేసి ఓపెన్ ఎండెడ్ కాంట్రాక్ట్ ను  YRF త‌మ గ్రిప్ లో ఉంచుకుంది. ఏదైనా చిత్రం విఫలమైతే ప్రొడక్షన్ హౌస్ 4 వారాల విండోను ఎంచుకుంటుంది. ఏదైనా మూవీ థియేటర్ లో బాగా కొనసాగితే.. థియేట్రికల్ ఆదాయాన్ని విస్తరించడానికి ప్రీమియర్ తేదీని పొడిగిస్తారు. సామ్రాట్ పృథ్వీరాజ్ ఇప్పుడు 4 వారాల్లో ప్రీమియర్ కు సిద్ధ‌మైందని తెలుస్తోంది.

యష్ రాజ్ సంస్థ నుంచి వ‌చ్చిన ర‌ణ‌వీర్ `జయేష్ భాయ్ జోర్దార్` కూడా కేవలం 4 వారాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ అవుతోంది. మొత్తం లైనప్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ 8 వారాల డిజిటల్ విండోను ఎంచుకున్నది రెండు చిత్రాల కోసం మాత్రమే. వాటిలో షారూక్ న‌టిస్తున్న‌ పఠాన్ .. స‌ల్మాన్ న‌టిస్తున్న‌ టైగర్ 3 ఉన్నాయి. బాలీవుడ్ లో ఇవి రెండు అతిపెద్ద యాక్షన్ సినిమాలు.

YRF కు ఈ రెండు చిత్రాలు చాలా కాలం పాటు చెప్పుకునేంత‌గా గ్యారెంటీ హిట్ అని హామీ ఇస్తాయని న‌మ్ముతున్నారు. థియేటర్లలో ఇవి ఘ‌న‌విజయం సాధించి లాంగ్ రన్ కొన‌సాగిస్తాయ‌ని హోప్ తో ఉంది స‌ద‌రు సంస్థ‌. అందువల్ల 8 వారాల OTT విండో కోసం సంతకాలు చేసార‌ని స‌మాచారం. ఎనిమిది వారాల విండో కోసం ఈ 2 చిత్రాలకు భారీ మొత్తాల‌ను య‌ష్ రాజ్ సంస్థ కోట్ చేసింది. 2022లో  YRF నుంచి వ‌చ్చే వాటిలో శంషేరా- మహారాజా- విజయ్ కృష్ణ ఆచార్యతో విక్కీ కౌశల్ తదుపరి చిత్రాలు ఉన్నాయి. ఇవ‌న్నీ నాలుగు వారాల విండోలో డిజిట‌ల్ లో విడుద‌ల‌వుతాయి.
Tags:    

Similar News