మన టాలెంట్ ని ముంబై లాగేసుకుంటుందా ?

Update: 2019-07-16 17:30 GMT
తెలుగు దర్శకుడు తీసిన హిందీ సినిమా బ్లాక్ బస్టర్ కావడం పట్ల సంతోషించాలో లేక సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ల దృష్టిలో పడ్డాడు కాబట్టి ఇక తెలుగు మూవీస్ చేయడేమో అని భయపడాలో అర్థం కావడం లేదు సందీప్ రెడ్డి వంగాను చూస్తుంటే. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో ఏకంగా 275 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించిన సందీప్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారాడు. బాలీవుడ్ క్రిటిక్స్ పనిగట్టుకుని కబీర్ సింగ్ ని తీవ్రంగా విమర్శించినా వాటిని లెక్క చేయకుండా మరీ ప్రేక్షకులు దీనికి బ్రహ్మరధం పట్టారు. ఇప్పటికీ చాలా సెంటర్స్ లో స్టడీగా ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగా ముంబైలో సెటిలయ్యే దిశగా ప్లానింగ్ ఉన్నట్టు ఫ్రెండ్స్ నుంచి వస్తున్న సమాచారం. హైదరాబాద్ లో స్థిర నివాసం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో వస్తున్న పేరుని నిలబెట్టుకోవాలంటే ఇక్కడుంటే సరిపోదు. రామ్ గోపాల్ వర్మ శివతో తెలుగులోనే గొప్ప బ్రేక్ అందుకున్నా ఆ తర్వాత ఓ రెండు మూడు సినిమాలు తీసి రంగీలా-సత్య-సర్కార్-కంపెనీ-భూత్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో పూర్తిగా ముంబైలోనే ఉండిపోయాడు.

తర్వాత ఏవేవో ఫ్లాపులు తీస్తూ పోతూ ఆఖరికి వివాదాలతో లక్ష్మిస్ ఎన్టీఆర్ ని పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇప్పటి కెరీర్ సంగతి ఎలా ఉన్నా సక్సెస్ కొట్టిన టైంలో రామ్ గోపాల్ వర్మ పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఎన్ని డిజాస్టర్లు ఇచ్చినా అక్కడ వర్మ అంటే ఒకరకమైన గౌరవం ఉంటుంది. సందీప్ వంగా తీరు చూస్తుంటే మహేష్ బాబు సినిమా కనక ఓకే కాకపోతే ముంబైలోనే తిష్ట వేసి అక్కడే ప్రాజెక్టులు ఓకే చేసుకునేలా ఉన్నాడు. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ మూవీస్ ఇంకా తెలుగు తీస్తాడు అనుకుంటే అతను ఇలా ఆలోచించడం చూస్తే మనకో మంచి టాలెంట్ దూరమైనట్టేగా

    

Tags:    

Similar News