సంజయ్ దత్ కు శిక్ష తగ్గించేశారు

Update: 2016-01-06 07:50 GMT
అక్రమాయుధాల కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనుకున్న దాని కంటే చాలా ముందే జైలు నుంచి బయటపడనున్నాడు. దాదాపు ఆరేడు నెలల ముందే అతడు స్వేచ్ఛా జీవి కానున్నాడు. సంజయ్ కు శిక్ష తగ్గించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసును కేంద్ర హోం శాఖ ఆమోదించింది. ఫిబ్రవరి 27న సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.  అక్రమాయుధాల కేసులో దోషిగా తేలిన సంజయ్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడ్డ సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో సంజయ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కోర్టు తీర్పు ప్రకారం సంజయ్ వచ్చే అక్టోబరు వరకు జైల్లోనే ఉండాలి. ఐతే సంజయ్ సత్ప్రవర్తను దృష్టిలో ఉంచుకుని జైలు శిక్ష తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. జైలులో బుద్ధిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న సంజయ్ కి నెలకు ఏడు రోజుల చొప్పున శిక్ష తగ్గించాలని లెక్క గట్టారు. కాగా గత మూడేళ్లలో రకరకాల కారణాలు చెప్పి పెరోల్ మీద విడుదలై కొన్ని నెలల పాటు ఇంట్లో గడిపి వెళ్లాడు సంజయ్ దత్. ఇప్పుడు ఆరేడు నెలల శిక్ష తగ్గించుకుని ముందే జైలు నుంచి బయటపడుతున్నాడు.
Tags:    

Similar News