అమ్మ, అక్క పాత్రల్లో నటించడమంటే అంత వీజీ కాదు. తల్లిగా ఆలనాపాలనా చూడాలి. అక్కగా డిగ్నిఫైడ్‌గా కనిపించాలి. ముఖానికి రంగేసుకుంటే పాత్రలోకి ఒదిగిపోవాలి. టాలీవుడ్‌లో అయితే జయసుధ, సుధ, ప్రగతి వంటి నటీమణులు ఉన్నారు. తల్లి, అక్క, చెల్లి పాత్రల్లో ఒదిగిపోయి నటించడం వీరి ప్రత్యేకత. ఇదే తరహాలో కోలీవుడ్‌లోనూ ఓ మదర్ ఉన్నారు.
పేరు శరణ్య పొన్ వన్నన్. ఇప్పటికే జాతీయ అవార్డు గ్రహీత. అప్పట్లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పంజా' చిత్రంలో అష్టకష్టాలు పడే తల్లిగా శరణ్య నటించారు. ఆ పాత్ర తెరపై కనిపిస్తున్నంత సేపూ థియేటర్‌లో కూచున్న మహిళామణులంతా భావోద్వేగాలకు లోనయ్యారు. కళ్లు చెమర్చే గొప్ప అభినయం శరణ్య చేసి చూపించారు. అంతటి గొప్ప నటి గనుకే అటు తమిళ్‌తో పాటు తెలుగులోనూ శరణ్యకు గొప్ప గౌరవం దక్కుతోంది. ప్రస్తుతం శరణ్య కోవై సరళతో కలిసి ఓ ఫన్నీ కామిక్ చిత్రంలో నటిస్తోంది. ఇట్లీ అనేది టైటిల్. విద్యాధరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కోవై తో కలిసి కామెడీ పండించడం చాలా ఫన్నీ అనుభవం అని చెబుతున్నారు శరణ్య.
ఈ విషయంలో కోవైతో పోటీపడలేనని అంటున్నారు. సీరియస్ ముఖంతో కనిపించే నేను కాసింత ఫన్నీగా కనిపించాలంటే కష్టించాల్సొస్తోందని, అయితే అది చాలా థ్రిల్లింగ్‌గా ఉదని అన్నారు శరణ్య. శరణ్య చూడటానికి తెలుగుదనం నిండిన ముఖారవిందంతో తెలుగింటి మమ్మీలా కనిపిస్తారు కాబట్టి తనకి తెలుగులోనూ అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి.