'సర్పట్ట' ట్రైలర్: బాక్సింగ్ కోసం రెండు వంశాల మధ్య నిరంతరం జరిగే ఘర్షణ..!

Update: 2021-07-13 15:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన తాజా చిత్రం "సర్పట్ట పరంబరై". 'మద్రాస్' 'కబాలి' 'కాలా' వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఎప్పటి నుంచో థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఎదురు చూసిన మేకర్స్.. పరిస్థితులు అనుకూలించేలా కనిపించకపోవడంతో ఓటీటీ విడుదలకు మొగ్గు చూపారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 22న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'సర్పట్ట' ట్రైలర్ ను హీరో సూర్య విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

'సర్పట్ట పరంబరై' ట్రైలర్ చూస్తుంటే 1970ల నాటి నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ స్పోర్ట్స్ కథాంశంతో రూపొందిన చిత్రమని తెలుస్తోంది. బ్రిటిష్ వారి కోసం వర్క్ చేయడంతో వారి బాక్సింగ్ నైపుణ్యాలను భారతీయులకు నేర్పించారని.. దీనిని ఉత్తర మద్రాసులోని రెండు కుటుంబాలు నేర్చుకున్నట్లు ట్రైలర్ మనకు తెలియజేస్తుంది. ఈ క్రమంలో బాక్సింగ్ వారసత్వం కోసం సర్పట్టా - ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య నిరంతరం జరిగే పోరాటాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. ఇందులో కబిలాన్ అనే పాత్రలో ఆర్య కనిపిస్తున్నారు. బాక్సింగ్ లో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తిని ఓడిస్తానని ఛాలెంజ్ చేసిన ఆర్య.. బాక్సింగ్ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాక్సర్‌ గా కనిపించేందుకు ఆర్య జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేసి కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేసాడు. అతని శ్రమ - ట్రాన్సఫార్మేషన్ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇందులో దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కలైరసన్ - పసుపతి - జాన్ కొక్కెన్ - జాన్ విజయ్ - సంతోష్ ప్రతాప్ - పార్థిబాన్ రాధాకృష్ణన్ -  భగవతి - సంజనా నటరాజన్‌ - తుషార తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మురళి.జి సినిమాటోగ్రఫీ అందించారు. నీలం ప్రొడక్షన్స్ సమర్పణలో కె9 స్టూడియోస్ బ్యానర్ పై షణ్ముగం దక్షణ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 22న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.



Full View
Tags:    

Similar News