మహానటి రిలీజ్ డేట్ సీక్రెట్

Update: 2018-05-05 13:27 GMT
సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రాన్ని మార్చి 29నే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమాను సిద్ధం చేయలేకపోవడంతో వాయిదా వేశారు. తర్వాత కొత్త డేట్ కోసం చూస్తున్నపుడు అశ్వినీదత్ వచ్చిన ఒక డేట్ సూచించారట. అదే.. మే 9. ఈ తేదీతో వైజయంతీ మూవీస్ సంస్థకు గొప్ప సెంటిమెంటు ముడిపడి ఉంది. ఆ సంస్థలో అతి పెద్ద విజయంగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజైంది ఆ తేదీకే కావడం విశేషం. అప్పట్లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. అప్పటి కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.

వైజయంతీ సంస్థకు గొప్ప పేరుతో పాటు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకునే అశ్వినీదత్ సూచన మేరకు మే 9న ‘మహానటి’ని రిలీజ్ చేయడానికి నిర్ణయించారు దత్ కూతుళ్లైన ఈ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్.. స్వప్న దత్. మరి ఈ సెంటిమెంటు ఏమేరకు ఫలిస్తుందో.. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. వైజయంతీ సంస్థ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. ‘కంత్రి’.. ‘శక్తి’.. ‘కథానాయకుడు’ లాంటి డిజాస్టర్లతో ఆ సంస్థ కుదేలైంది. ‘ఎవడే సుబ్రమణ్యం’ మంచి సినిమా అనిపించుకుంది కానీ.. లాభాలేమీ అందించలేదు. ‘మహానటి’ పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు తెస్తుందని దత్ కుటుంబం ఆశాభావంతో ఉంది. దత్ అల్లుడు.. ప్రియాంక భర్త నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News