ఒక మహోన్నత వ్యక్తి జీవితగాధను 5 నిముషాల వ్యవధిలో పల్లవి, చరణాల ద్వయంలో ఇరికించడం అత్యంత కష్టతరమైన పని. అటువంటి పనిని మరో మహోన్నత వ్యక్తి దీక్షగా చేపట్టి పూర్తిచేసిన తీరు అసమాన్యం. దాదాపు రెండొందలేళ్ళ దాస్యశృంఖలాలను విడిపించే క్రమంలో కీలక భూమిక పోషించిన గాంధీ చరితని, గాంధేయవాదాన్ని నేటి ఆధునిక మాహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు 'మహాత్మ' సినిమాలో ఒక పాట ద్వారా మనకు అందించడం మనం చేసుకున్న అదృష్టం.
ఈ పాటలో ఒక్కో వాక్యం రాయడానికి ఆయన ఎంత మధనపడి వుంటారో వింటుంటే, చదువుతుంటే అర్ధమవుతుంది. సరళమైన పదాలతో, పొద్దుకైనా ప్రాసలతో సగటు ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టించిన తీరు అద్భుతం. సిరివెన్నెల కలానికి, బాలు గాత్రం తోడవ్వడంతో పాటకు దైవత్వం సమకూరింది.
గాంధీ అంటే ఒక ఇంటిపేరో, ఒక వీధి పేరో, నవ్వుతూ నులుచునే బొమ్మో కాదని మన భరతమాత తలరాతను మార్చిన బ్రహ్మ అని పల్లవితో మొదలుపెట్టి, రామ రాజ్యమే గాంధీ కల అని, సత్యం అహింస, అంటరానితన నిర్మూలన తన తపనని తెలుపుతూనే దండి యాత్ర, స్వాతంత్ర దీక్ష వంటి మహోన్నత విజయాలను స్మరిస్తూ ఆ సినిమాకు ఈ పాటను ఆయువుపట్టుగా నిలిపారు.
మన దేశ ప్రజల గోప్పతన్నాన్ని గుర్తుచేసి, మనలోని స్పూర్తిని రగిల్చే ఈ పాటను ఆ మహాత్ముని జయంతి సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం,, .