విలక్షణ దర్శకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

Update: 2016-07-12 19:30 GMT
తరుణ్ హీరోగా మంచి ఫాంలో ఉన్నపుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్లో ‘అదృష్టం’ అనే సినిమా ఒకటి చేశాడు గుర్తుందా..? ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు శేఖర్ సూరి. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. శేఖర్ విషయం ఉన్న దర్శకుడని.. వైవిధ్య సినిమాలు డీల్ చేయగల సత్తా ఉన్నవాడని అందరికీ అర్థమైంది. తొలి సినిమా పరాజయం నుంచి కోలుకోవడానికి శేఖర్ కు చాలా సమయమే పట్టింది కానీ.. రెండో సినిమా ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాతో తనేంటో రుజువు చేసుకున్నాడు శేఖర్. ఆ సినిమా అప్పటికి తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది.

‘ఎ ఫిలిం బై అరవింద్’ తర్వాత ‘త్రీ’ అనే మరో థ్రిల్లర్ తీశాడు శేఖర్. కానీ ఈసారి రిజల్ట్ తేడా కొట్టేసింది. ఆ దెబ్బకు ఏడెనిమిదేళ్లు కనిపించకుండా పోయిన ఈ విలక్షణ దర్శకుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘డాక్టర్ చక్రవర్తి’. ఈ పేరు చూసి ఇదేదో సాంఘిక చిత్రం అనుకోకండి. శేఖర్ స్టయిల్లోనే ఇది కూడా హార్రర్ థ్రిల్లరట. రిషి.. సోనియా జంటగా నటించారు. శేఖర్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించాడు కూడా. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. ‘ఎ ఫిలిం బై అరవింద్’ తరహాలోనే ఇది కూడా వైవిధ్యమైన సినిమా అని.. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంటున్నాడు శేఖర్. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.
Tags:    

Similar News