25 కుట్లు.. షాహీద్ క‌పూర్ క‌ఠోర శ్రమ 'జ‌ర్నీ ఆఫ్ జెర్సీ'

Update: 2021-12-19 02:30 GMT
ఒక సినిమా రిస్కీ షాట్ లలో న‌టించాలంటే డూప్‌లతో లాగించేసేవారు. ఎలాంటి ప్ర‌మాదాలు జ‌రిగినా వారికే జ‌రిగేవి.. ఆ విష‌యం బ‌య‌టికి కూడా వ‌చ్చేది కాదు. కానీ కాలం మారింది. త‌మ‌ని ప్రేమించే అభిమానుల్ని మెప్పించాలన్నా.. వారి మ‌న‌సుల్ని గెలుచుకోవాల‌న్నా ఎలాంటి రిస్క్ లు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. ప్ర‌మాద‌మ‌ని తెలిసినా ఎంత‌టి రిస్క్‌లు చేసేందుకైనా వెర‌వ‌డం లేదు. విధి ఆడిన ఆట‌లో ఓడిపోయి విజేత‌గా నిలిచిన ఓ క్రికెట‌ర్ క‌థ‌గా తెర‌కెక్కిన చిత్రం `జెర్సీ`. నేచుర‌ల్ స్టార్ ప్ర‌మాదాల‌కు ఎదురొడ్డి చేసిన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించడ‌మే కాకుండా జాతీయ స్థాయిలో మూడు విభాగాల్లో అవార్డుల్ని గెలుచుకుంది.

ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో షాహీద్ క‌పూర్ తో దిల్ రాజు, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, అమ‌న్ గిల్ రీమేక్ చేశారు. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట్ చేశాడు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ నెలాఖ‌రున ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన `జ‌ర్నీ ఆఫ్ జెర్సీ` నెట్టింట వైర‌ల్ గా మారింది. క్రికెట‌ర్ గా అర్జున్ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డం కోసం హీరో షాహీద్ క‌పూర్ ప‌డిన క‌ఠోర శ్ర‌మ‌.. నెత్తురోడుతున్నా ప‌ట్టుద‌ల‌తో క్రికెట్ ని నేర్చుకున్న తీరు వీక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తోంది.

ఈ సినిమాలో షాహీద్ పాత్ర గెల‌చి ఓడిన ఓ క్రికెట‌ర్ పాత్ర. ఆ పాత్ర‌ని వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించ‌డం కోసం షాహీద్ క‌పూర్ పెట్టిన ఎఫ‌ర్ట్ అంతా ఇంతా కాదు.. ఒక ద‌శ‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా షాహీద్ పెదాలు చిట్లి ర‌క్తం దార‌ల్లా కారుతున్నా ప‌ట్టుద‌ల‌తో క్రికెట్ ని నేర్చ‌కుని అర్జున్ పాత్ర‌ని తెర‌పై అద్భుతంగా పండించాడు. ఈ క్ర‌మంలో అత‌నికి జ‌రిగిన ప్ర‌మాదాల‌కు 25 క‌ట్లు ప‌డ‌టం గ‌మ‌నార్హం. `జ‌ర్నీ ఆఫ్ జెర్సీ` అంటూ విడుద‌ల చేసిన వీడియోలో పెదాలు ప‌గిలి ర‌క్తం కారుతున్న దృశ్యాలు చూసిన వారంతా ఓ పాత్ర కోసం ఇంత‌గా మ‌న హీరోలు ప్ర‌మాదాల‌ని సైతం లెక్క చేయ‌కుండా శ్ర‌మిస్తారా అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఓ ప్ర‌త్యేక ట్రైన‌ర్ స‌హాయంతో ఎన్ని ప్ర‌మాదాలు ప‌ల‌క‌రించినా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప‌ట్టుద‌ల‌తో షాహీద్ `జెర్సీ` చిత్రాన్ని పూర్తి చేసిన తీరు ప‌లువురిని ఆకట్టుకుంటోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో పంక‌జ్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. తాజాగా విడుద‌ల చేసిన `జ‌ర్నీ ఆఫ్ జెర్సీ` సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచేసింది. తెలుగు `జెర్సీ` త‌ర‌హాలో హిందీ వెర్ష‌న్ కూడా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అంటున్నారు బాలీవుడ్ జ‌నాలు.
Tags:    

Similar News