దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని దర్శకుడు శంకర్. సందేశాత్మక సినిమాలతో పాటు, విలక్షణ కథాంశలను తెరకెక్కించడంలో శంకర్ ది అందెవేసిన చెయ్యి. శంకర్ వర్కింగ్ స్టైల్ కు, సినిమాల పట్ల ఆయనకు ఉండే అంకితభావానికి స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోతుంటారు. అయితే, శంకర్ మాత్రం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంకితభావానికి, ఈ వయసులో కూడా ఆయన చూపించే ఉత్సాహానికి మంత్రముగ్దుడయ్యారట. రోబో 2.ఓ ఆడియో వేడుక సందర్భంగా రజనీపై శంకర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఎనర్జీ లెవల్స్ ను చూసి తనకు ఆశ్చర్యమేసిందని శంకర్ చెప్పారు.
తాము ఢిల్లీలో షూటింగ్ చేస్తున్న సమయంలో 40 డిగ్రీల ఎండలో 12 కిలోల సూట్ వేసుకొని కూడా రజనీ ఉత్సాహంగా ఉండేవారని శంకర్ చెప్పారు. ఆయనను ఓ బాక్సులో ఉంచి పూడ్చి పెట్టే సన్నివేశంలో నాలుగు గంటల పాటు రజనీ సర్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నారన్నారు. ఈ వయసులో కూడా సరికొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారన్నారు. ఈ సినిమా కోసం రజనీ సర్ పడిన శ్రమ ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుందన్నారు.‘‘రోబో’ లోని ‘ఇనుములో ఓ హృదయం మొలిచెలే’ పాట రెహమాన్ కు ఓ సవాల్ వంటిదని - రోబోకు - యువతికి మధ్య ప్రేమ పుట్టే సన్నివేశానికి ఓ కొత్త శబ్దం వినపడేలా ట్యూన్ ను రెహమాన్ అవలీలగా క్రియేట్ చేశాడన్నారు. ఈ సినిమాలో రెండు రోబోల మధ్య పుట్టే ప్రేమకు ఓ కొత్త ట్రాక్ ను సృష్టించామన్నారు. ప్రతీసారి అద్భుతమైన సంగీతం ఇవ్వడం తమ ఇద్దరికీ కష్టమయ్యేదన్నారు. కానీ, రెహమాన్ ప్రతీసారి ఏదో ఒక కొత్త ట్యూన్ వినిపిస్తూ తనను ఆశ్చర్యపరిచేవాడన్నారు.