శర్వానంద్.. ఇప్పుడైనా పాఠం నేర్చుకుంటాడా?

Update: 2017-05-23 07:40 GMT
కొందరు హీరోల్ని చూడగానే వాళ్లకు మంచి టేస్టుందని.. సరి కొత్త కథలు ఎంచుకుంటారని.. వాళ్ల సినిమాలు భిన్నంగా ఉంటాయని నమ్మకం కుదురుతుంది. అలాంటి కథానాయకుల్లో శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో సరైన అవకాశాలు దొరక్క చేతికొచ్చిన ప్రతి సినిమా.. ప్రతి పాత్రా చేశాడు కానీ.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు వచ్చాక మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు శర్వా. నెమ్మదిగా శర్వా సినిమాలంటే ఏదో ప్రత్యేకత ఉంటుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలపడింది. ఐతే ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్నాక కూడా కూడా శర్వా అప్పుడప్పుడూ తప్పటడుగులు వేస్తున్నాడు.

ఆ మధ్య అల్లరి నరేష్ తో కలిసి ‘నువ్వా నేనా’ అనే పరమ రొటీన్ సినిమా ఒకటి చేశాడు శర్వా. ఆ సినిమా చూసి.. అందులో శర్వా క్యారెక్టర్ చూసి.. అతను ఇలాంటి సినిమా చేశాడేంటబ్బా అన్న సందేహం కలిగింది జనాలకు. ఐతే ఆ తర్వాత మళ్లీ శర్వా కుదురుకున్నాడు. గత రెండు మూడేళ్లలో వైవిధ్యమైన సినిమాలు.. మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. కానీ ‘రాధ’ దగ్గరికి వచ్చేసరికి శర్వా మళ్లీ గాడి తప్పాడు. ఈ సినిమా చూసి.. ఇంత రొటీన్ సినిమా శర్వా ఎందుకు చేశాడా అని జనాల్లో సందేహం కలిగింది. శర్వా మీద ఎన్నో ఆశలతో థియేటర్లకు వచ్చిన జనాలకు నిరాశ తప్పలేదు.

శర్వా వరుస హిట్లతో మాంచి ఊపు మీదుండటంతో ‘రాధ’కు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. కానీ తర్వాత సినిమా నిలబడలేదు. బయ్యర్లకు.. నిర్మాతకు నష్టాలు తప్పవని తేలిపోయింది. వేరే హీరోలు ఇలాంటి రొటీన్ సినిమాలు చేసినా జనాలు పెద్దగా పట్టించుకోరు కానీ.. శర్వా ఇలాంటివి చేస్తే మాత్రం నిరాశకు గురవుతారు. ఫలానా దర్శకుడు విభిన్నమైన సినిమాలు చేస్తాడని పేరుంటుంది కానీ.. ఫలానా హీరో సినిమా అంటే వైవిధ్యంగా ఉంటుందన్న గుర్తింపు రావడం అరుదు. శర్వా ఆ అరుదైన క్లబ్బులోనే ఉన్నాడు. ఈ గుర్తింపును నిలబెట్టుకుంటూ శర్వా కొంచెం భిన్నమైన సినిమాలతో మెప్పించడం మీద దృష్టిపెడితే బెటర్.
Tags:    

Similar News