హిట్ ఫార్ములాగా మారిపోయిన టైమ్ ట్రావెల్ నేపథ్యం!

Update: 2022-09-11 23:30 GMT
టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ తెరపై వచ్చి చాలాకాలమే అయింది. అయితే హాలీవుడ్ సినిమాలను చూసే అలవాటు ఉన్నవారిని పక్కన పెడితే, తెలుగు ప్రేక్షకులకు టైమ్ ట్రావెల్ అంటే ఇది అని చెప్పిన సినిమా మాత్రం 'ఆదిత్య 369'. ఆ సినిమాకి ప్రధానమైన బలం కథాకథనాలతో పాటు టైమ్ మిషన్ ను డిజైన్ చేయించిన తీరు కూడా. ఈ సినిమాలో హీరో  కాలంలో వెనక్కి వెళతాడు .. ముందుకు వెళతాడు. ఎక్కడ ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా సింగీతం రాసుకున్న స్క్రిప్ట్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించింది.

ఇక ఆ తరువాత సౌత్ ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకున్న సినిమా ఏదైనా ఉందంటే, అది సూర్య హీరోగా చేసిన '24'.  విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. వాచ్ తోనే కాలంలో వెనక్కి .. ముందుకు వెళ్లేలా డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. సూర్య కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఇది ఒకటిగా నిలిచింది. విక్రమ్ కుమార్ చేసిన ప్రయోగాల్లో ఈ సినిమా ముందువరుసలో కనిపిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

ఇక ఆ తరువాత టైమ్ ట్రావెల్ సినిమాలు ఇక్కడ పెద్దగా రాలేదు. అందుకు కారణం  ఈ తరహా కథలను ఆషా మాషీగా అల్లుకోవడం కుదరదు. సైన్స్ పరమైన లాజిక్కులు తెలియాలి. అంతేకాదు .. ఎక్కడ ఎలాంటి కన్ ఫ్యూజన్ ఉండకూడదు. ఇలాంటి కాన్సెప్ట్ లకు ఎక్కువ సమయం పడుతుంది .. ఎక్కువ బడ్జెట్ అవుతుంది. అందువలన సాధారణంగా ఈ వైపు వెళ్లేవారు ఎక్కువగా కనిపించరు. కానీ సింపుల్ బడ్జెట్ లో కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తీయవచ్చునని .. అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చునని నిరూపించిన సినిమాగా 'ఒకే ఒక జీవితం' కనిపిస్తోంది.

శర్వానంద్ హీరోగా శ్రీకార్తీక్ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు యువకులు కాలంలో తమ బాల్యానికి వెళతారు. అప్పుడు తాము ఎలా ఉన్నామనేది ప్రత్యక్షంగా చూసుకుని, వాళ్లని  సరిదిద్దడానికి ట్రై చేస్తారు. ఇదే ఈ కథలోని కొత్త పాయింట్. ఇది కేవలం సెంటిమెంట్ సినిమానే అనుకున్నవారు ఎక్కువగా ఉండటం వలన, ఓపెనింగ్స్ అంతగా రాలేదు. మదర్ సెంటిమెంట్ తో పాటు టైమ్ ట్రావెల్ ట్రాక్ .. వాటిని టచ్ చేస్తూ సాగే  కామెడీ ట్రాక్ బాగున్నాయనే మౌత్ టాక్ తో ఈ సినిమా వసూళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. గతంలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సక్సెస్ ను సాధించిన సినిమాల మాదిరిగానే, ఈ సినిమా కూడా హిట్ కేటగిరీలోకి చేరిపోయేలా కనిపిస్తోంది. సరిగ్గా వర్కౌట్ చేస్తే టైమ్ ట్రావెల్ అనే పాయింట్ హిట్ ఫార్ములాగానే కనిపిస్తోంది కదూ! 
Tags:    

Similar News