మూవీ రివ్యూ : శతమానం భవతి

Update: 2017-01-14 09:37 GMT
చిత్రం : ‘శతమానం భవతి’

నటీనటులు: శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - నరేష్ - ఇంద్రజ - సిజ్జు - ప్రవీణ్ - జబర్దస్త్ రవి - ప్రభాస్ శీను - తనికెళ్ల భరణి - రవిప్రకాష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: దిల్ రాజు - శిరీష్
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వేగేశ్న సతీష్

గత ఏడాది సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాల మధ్య తన సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ను పోటీకి నిలిపి సక్సెస్ సాధించాడు శర్వానంద్. ఈసారి కూడా ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీ ఉన్నా ‘శతమానం భవతి’తో వచ్చాడు శర్వా. దిల్ రాజు నిర్మాణంలో వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి శర్వా బృందానికి అంత ధీమా కలిగించేంత ప్రత్యేకత ఈ చిత్రంలో ఏముందో చూద్దాం పదండి.

కథ:

ఆత్రేయపురం అనే ఓ పల్లెటూరిలో రాఘవరాజు (ప్రకాష్ రాజ్) అనే పెద్ద మనిషి తన భార్య జానకి (జయసుధ)తో కలిసి హుందాగా బతుకుతుంటాడు. ఐతే ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్న రాజు కుటుంబం.. ఆయన పిల్లలు పెద్దవాళ్లయ్యాక వేర్వేరు కుటుంబాలవుతుంది. విదేశాల్లో స్థిరపడ్డ పిల్లల్ని చూడాలని తన భార్య తపిస్తుండటంతో వాళ్లను రప్పించడానికి ఓ పథకం వేస్తాడు రాఘవరాజు. అది ఫలించి ఆయన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి ఇక్కడికి వస్తారు. ఆత్రేయపురంలోనే ఉంటూ రాఘవరాజు కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించే రాజు (శర్వానంద్).. ఆయన మనవరాలు నిత్య (అనుపమ పరమేశ్వరన్)కు దగ్గరవుతాడు. మరి పిల్లల్ని రప్పించడానికి రాఘవరాజు వేసిన పథకమేంటి.. అది తెలిశాక ఆయన భార్య ఎలా స్పందించింది.. మరోవైపు రాజు-నిత్యల ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

‘పాత ఒక రోత.. కొత్తొక వింత’ అంటారు. అదే సమయంలో ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాటా వినిపిస్తుంది. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న రెండో మాటనే బలంగా నమ్మాడు. ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన కథనే కొంచెం రీసైకిల్ చేసి ‘శతమానం భవతి’ని తెరకెక్కించాడు. ఇలాంటి కథతో గత కొన్నేళ్లలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కథ పాతదైనా.. దాన్ని చెప్పే తీరు ఆహ్లాదకరంగా ఉంటే జనాలకు కంప్లైంట్స్ ఏమీ ఉండదని చాటి చెబుతుంది ‘శతమానం భవతి’.

ఆద్యంతం అంచనాలకు తగ్గట్లుగానే కథ సాగుతున్నా.. సన్నివేశాలు కూడా అంత కొత్తగా ఏమీ లేకపోయినా.. ఆహ్లాదకరంగా.. కన్విన్సింగ్ గా అనిపించే సన్నివేశాలు బండి నడిపించేస్తాయి. 140 నిమిషాల పాటు ఎక్కడా పెద్దగా ఇబ్బంది పడకుండా సమయాన్ని ఖర్చు చేయించేస్తుంది ‘శతమానం భవతి’. సంక్రాంతి సీజన్లో సరిగ్గా ప్రేక్షకులు ఎలాంటి కుటుంబ వినోదాన్ని ఆశిస్తారో అలాగే ఉండటం ‘శతమానం భవతి’కి పెద్ద బలం.

సంపాదనలో పడి.. విదేశాల్లో స్థిరపడిపోయి మూలాల్ని మరిచిపోయిన నేటి తరానికి కుటుంబ విలువల ప్రాముఖ్యతను తెలియజెప్పే ప్రయత్నమే ‘శతమానం భవతి’. ‘మిథునం’ తరహాలో ఇక్కడో పల్లెటూరిలో వృద్ధ జంట పిల్లల కోసం తపిస్తూ ఉంటుంది. వారి పిల్లలేమో విదేశాల్లో స్థిరపడి.. ఏడాదికోసారి కూడా ఇక్కడికి రాలేనంత బిజీగా ఉంటారు. అలాంటి వాళ్లంతా ఓ కారణంతో ఇక్కడికి రావడం.. ఇక్కడ గడిపే రెండు మూడు వారాల్లో తాము ఏం కోల్పోతున్నామో తెలుసుకుని అందరూ ఒక్కడవడం.. ఇలా రొటీన్ గా సాగుతుంది కథ.

ఐతే తెలిసిన కథనే కన్విన్సింగ్ గా.. బోర్ కొట్టించకుండా చెప్పడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ప్రతి ప్రేక్షకుడూ సులభంగా కనెక్టయ్యే నేపథ్యం.. పాత్రలు.. సన్నివేశాలు.. ‘శతమానం భవతి’కి బలంగా నిలిచాయి. పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకోవడం.. ఆద్యంతం తెరను ఆహ్లాదంగా చూపించడంతో ఆరంభం నుంచే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. పాత్రలు కూడా సహజంగా ఈజీగా కనెక్టయ్యేలా ఉంటాయి. వాటితో పాటు ప్రేక్షకుల్ని ప్రయాణించేలా చేస్తాయి. ఆయా పాత్రలకు ఎంచుకున్న నటీనటులూ చక్కగా కుదిరారు. ప్రతిదానికీ కంగారు పడిపోతూ కంగార్రాజు అని పిలిపించుకునే బంగార్రాజు (నరేష్ చేశాడు) లాంటి పాత్రలు సినిమాలో ప్రత్యేకంగా నిలిచాయి.

ప్రథమార్ధానికి హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్.. హడావుడిగా లేకుండా సింపుల్ గా సాగిపోయే కామెడీ సీన్స్ బలంగా నిలుస్తాయి. హీరోయిన్ని హీరో ఇంప్రెస్ చేసే సన్నివేశాలకు ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అవుతారు. ఆ ఎపిసోడ్లో సన్నివేశాలన్నీ ఆహ్లాదకరంగా సాగుతాయి. ముఖ్యంగా హీరోయిన్ని ఏడిపించిన వాడికి హీరో బుద్ధి చెప్పే సీన్ ఈ ఎపిసోడ్ కు హైలైట్ గా నిలుస్తుంది. ‘‘పేరు పెట్టి పిలిస్తే పిలుపే ఉంటుంది. బంధుత్వంతో పిలిస్తే బంధం ఉంటుంది’’.. ‘‘అవసరమైనంత సంపాదిస్తే హ్యాపీ.. అవసరమైందాని కంటే ఎక్కువ సంపాదిస్తే బిజీ’’ .. లాంటి అర్థవంతమైన డైలాగులు ప్రేక్షకుడిని ఈజీగా కథతో రిలేట్ చేసుకునేలా చేస్తాయి. ప్రథమార్ధం అంతా కూడా వేగంగా.. ఆహ్లాదకరంగా సాగిపోయి చక్కటి ట్విస్టుతో ముగుస్తుంది.

ఐతే చక్కటి ప్రథమార్ధం చూశాక ప్రేక్షకుడు పెట్టుకునే అంచనాల్ని ద్వితీయార్ధం అందుకోలేకపోయింది. కొన్ని అనవసర సన్నివేశాలు.. సాగతీత వల్ల కథ క్లైమాక్స్ చేరడానికి ఎక్కువ సమయం పట్టేసింది. సిజ్జు పాత్రను అతడి ఒకప్పటి ప్రేయసితో కలిపే సన్నివేశం మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఇంకో రెండు మూడు పడితే క్లైమాక్స్ ముంగిట మంచి ఎమోషన్ వచ్చేది. చాలా రొటీన్ గా హీరోయిన్ విషయంలో హీరో త్యాగానికి సిద్ధపడే సీన్ పెట్టడం.. అందులో మెలోడ్రామా మరీ ఎక్కువైపోవడంతో అదోలా అనిపిస్తుంది. ఐతే క్లైమాక్స్ విషయంలో మాత్రం దర్శకుడు తప్పటడుగు వేయలేదు. ఇక్కడ కూడా కొంతవరకు ఫోర్డ్స్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ మంచి డైలాగులు.. ప్రకాష్ రాజ్ నటన క్లైమాక్స్ ను నిలబెట్టాయి. అక్కడ కూడా  కథాకథనాల్లో కొత్తదనం లేకపోవడం.. ద్వితీయార్ధంలో అప్ అండ్ డౌన్స్ ‘శతమానం భవతి’కి ప్రతికూలతలే అయినా.. ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓవరాల్ గా మంచి ఫీలింగే ఇస్తుంది.

నటీనటులు:

శర్వానంద్ ఏ హడావుడి లేకుండా సింపుల్ గా రాజు పాత్రను పండించాడు. అతడి సహజ నటన వల్ల రాజు పాత్రతో చాలా ఈజీగా కనెక్టయిపోతాం. తన తొలి రెండు సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన అనుపమ.. ఈసారి మోడర్న్ అమ్మాయిగానూ ఆకట్టుకుంది. ఆమె డబ్బింగ్ ఎన్నారై అమ్మాయి పాత్రకు సరిపోయింది. గ్లామర్ పరంగా ఆమెకు ఓ మోస్తరు మార్కులే పడతాయి. ప్రకాష్ రాజ్ తక్కువ సన్నివేశాలతోనే మెప్పించాడు. రాఘవరాజు పాత్రలో హుందాగా నటించాడు. క్లైమాక్సులో నటుడిగా తన స్థాయి ఏంటో చూపించాడు. ఇంతకుముందు ఆయన ఇలాంటి పాత్రలు చేసినపుడు కొంచెం అతిగా నటించిన భావన కలిగి ఉండొచ్చేమో కానీ.. రాఘవరాజు పాత్రలో మాత్రం అలాంటిదేమీ కనిపించదు. జయసుధ కూడా పాత్రకు తగ్గట్లుగా నటించింది. బంగర్రాజు పాత్రలో నరేష్ అదరగొట్టాడు. సినిమాలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించేది ఆయన పాత్ర.. నటనే. సిజ్జు.. ప్రవీణ్.. రచ్చ రవి.. ప్రభాస్ శీను.. ప్రవీణ్.. వీళ్లందరూ కూడా పాత్రలకు తగ్గట్లుగా నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం:

సంగీతం.. ఛాయాగ్రహణం సినిమాకు బలంగా నిలిచాయి. మిక్కీ జే మేయర్ సంగీతం ‘సీతమ్మ వాకిట్లో..’ లాంటి సినిమాల్ని గుర్తుకు తెచ్చినప్పటికీ సినిమాకు సరిపోయింది. మమతలు పంచే ఊరు.. పాట వెంటాడుతుంది. బాలు పాడిన ‘నిలవదే..’ పాట.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. సమీర్ రెడ్డి కెమెరా పనితనం సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకొచ్చింది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా అందంగా చూపించాడు సమీర్. పాటల చిత్రీకరణ చాలా బాగుంది.

ముఖ్యంగా శర్వా-అనుపమలను వింటేజ్ లుక్ లో చూపించే పాటను చాలా బాగా తీశాడు. మమతలు పంచే ఊరు పాట కూడా అంతే ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు దిల్ రాజు బేనర్ స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. సతీష్ వేగేశ్న రచయితగా.. దర్శకుడిగా మెప్పించాడు. సినిమాలో గుండెకు హత్తుకునే మాటలు చాలా ఉన్నాయి. ‘‘ప్రేమించే మనిషి వదులుకోవడమంటే ప్రేమను వదులుకోవడం కాదు’’.. ‘‘దేవుడు ప్రేమించే మనసు అందరికీ ఇస్తాడు.. ప్రేమించిన మనిషిని కొందరికే ఇస్తాడు’’.. లాంటి డైలాగులు బలంగా తాకుతాయి. పాత కథనే ఎంచుకున్నప్పటికీ మంచి సన్నివేశాలు రాసుకోవడం.. స్క్రిప్టులో ఉన్నదాన్ని తడబాటు లేకుండా.. ప్రభావవంతంగా తెరకెక్కించడం ద్వారా సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు. ద్వితీయార్ధంలో అతను కొంచెం రిలాక్స్ అయ్యాడు. రాజీ పడ్డాడు. ఓవరాల్ గా సతీష్ దర్శకుడిగా విజయవంతమయ్యాడు.

చివరగా: శతమానం భవతి.. పాతదే కానీ పండింది!

రేటింగ్- 3/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News