శివశంకర్ మాస్టారుకు ఎంత కష్టమొచ్చిందో!

Update: 2016-06-01 04:34 GMT
కొరియోగ్రాఫర్ శివశంకర్ మాష్టార్ గుర్తున్నారా? బుల్లితెర మీద రియాల్టీ షోలలో తనదైన శైలితో ఆకట్టుకున్న ఆయన ఈమధ్యన బుల్లితెర మీద పెద్దగా కనిపించటం లేదు. ఈ మాష్టారికి తాజాగా పెద్ద సమస్యే వచ్చి పడింది. తమ కుటుంబం మీద తమ కోడలు చేస్తున్న విమర్శలు.. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయన.. ఇప్పుడు తమను ఆదుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను వేడుకుంటున్నారు. తమ విషయంలో అమ్మ కానీ కలుగజేసుకోకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని వాపోతున్నారు.

ఇంతకీ శివశంకర్ కు అంత పెద్ద సమస్య ఏమిటంటే.. ఆయన కుమారుడు విజయకృష్ణ బెంగళూరుకు చెందిన జ్యోతిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులకే భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. అనంతరం వారు విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జ్యోతి శివశంకర్ ఇంటి ముందు ధర్నా చేసి.. కట్నం కోసం శివశంకర్ ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తప్పుడు ఆరోపణలతో పోలీసులు తమపై కేసు నమోదు చేయటంతో తాము అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి వచ్చిందని.. తమను రూ.10కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని.. తాను కష్టపడి సంపాదించిన ఆస్తిని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో తనను అమ్మే కాపాడాలంటూ ఆయన వేడుకుంటున్నారు. తన కొడుకు కోడలితో కాపురం చేయటానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పటం గమనార్హం. మరి.. శివశంకర్ మాష్టారి ఇష్యూను అమ్మ టేకప్ చేస్తారా..?
Tags:    

Similar News