శివమ్ సినిమాను సైలెంటుగా ముగించేశాడు రామ్. ఇంకో 20 రోజుల్లోనే సినిమా విడుదలైపోతోంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో వేడుక కూడా ఘనంగా చేస్తున్నారు. స్రవంతి మూవీస్ 30 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి వారికిది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీసిన ఇది. శ్రీనివాసరెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోస్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఆడియో ఫంక్షన్ నేపథ్యంలో ముందే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దేవిశ్రీ తనదైన శైలిలో చాలా జోష్ తో చేశాడీ పాటని. భాస్కరభట్ల సాహిత్యం, కార్తీక్ గాత్రం చక్కగా కుదిరాయి. ఇన్ స్టంట్ గా ఎక్కేసేలా ఉన్న ఈ పాట ఎలా సాగుతుందో చూడండి.
‘‘నేనేగానీ ఫ్రెండై ఉంటే.. దేవదాసు పుట్టేవాడా.. మందు కొట్టేవాడా.. అట్టాపోయేవాడా..
నేనేగానీ ఫ్రెండై ఉంటే.. మజ్ను పిచ్చోడయ్యేవాడా.. సోలోగా తిరిగేవాడా.. శోకంలో మునిగేవాడా.. లైఫంతా ఏడ్చేవాడా.. వయసొస్తే ప్రేమించాలి.. ప్రేమిస్తే ఎదురెళ్లాలి.. ఎదురెళ్లి సాధించాలి.. భయపడ్డం అంటే చావేరా.. శివమ్ శివమ్.. శివమ్ శివమ్ కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం’’ అంటూ సాగుతుంది పల్లవి. చరణాల్లో కూడా నాకే గానీ ఫ్రెండ్సయి ఉంటే అంటూ రాగాలందుకున్నాడు హీరో. తనకి ఫ్రెండ్సయి ఉంటే ఉంటే రోమియో జూలియట్టూ.. పెళ్లయిపోయి పాడేవాళ్లు లవ్ డ్యూయెట్ లు.. అంటూ తన వ్యక్తిత్వమేంటో చెప్పే ప్రయత్నం చేశాడు. పాట హుషారుగా భలేగా ఉంది. మిగతా పాటలెలా ఉన్నాయో ఈ రోజు రాత్రికి తెలిసిపోతుంది.