'నా కోసం బ్రతకాలి నాన్నా' అంటూ ఏడ్చాను: శివానీ రాజశేఖర్

Update: 2022-05-18 14:22 GMT
రాజశేఖర్ తాజా చిత్రంగా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శేఖర్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాలో  రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, అందరికంటే ఎక్కువసేపు శివాని మాట్లాడింది. చాలా బాగా చేశావు నాన్న అంటూ తండ్రినీ .. చాలా బాగా తీశావమ్మా  అంటూ తల్లిని ఆమె ఈ వేదికపై అభినందించడం విశేషం. అలాగే తన తండ్రిపై తనకి గల ప్రేమానురాగాలను ఆమె ఆవిష్కరించిన తీరు అక్కడి వాళ్లందరినీ కన్నీళ్లు పెట్టించింది.

నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత నేను ఒప్పుకున్న సినిమాలు ఆగిపోవడం .. షూటింగును  పూర్తి చేసుకున్న సినిమాలు వాయిదా పడటం జరుగుతూ వచ్చింది.  దాంతో అందరూ కూడా నా జాతకంలో దోషం ఉందేమో చూపించమని అనడం మొదలుపెట్టారు. కానీ అలాంటి మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం మొదలు పెట్టాను.  అలాంటి పరిస్థితుల్లోనే 'శేఖర్' సినిమాను చేయాలనుకున్నాము. కానీ ఈ లోగా నా వల్లనే నాన్నకు కోవిడ్ వచ్చింది. నాకు వెంటనే తగ్గిందిగానీ .. నాన్నకు ఎంత సీరియస్ అయిందో మీ అందరికీ తెలుసు.

దాదాపు నెల రోజులకు పైగా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఒకానొక దశలో ఆయన వాష్ రూమ్ కి కూడా వెళ్లలేకపోయారు. 'నాకు సరిగ్గా ఊపిరాడటం లేదు' అని మా నాన్న అన్నప్పుడు కాలం స్థంభించిపోయినట్టుగా  అనిపించింది. మాకు అన్నీ మా నాన్ననే. ఆయన డాక్టర్ .. మాలో ఎవరికైనా ఏమైనా అయితే తాను చూసుకుంటారు. ఆయనకి ఏమైనా అయితే పరిస్థితి ఏమిటి? అనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి డాక్టర్ గారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. నేను నిజంగానే నష్టజాతకురాలినేమో అని అప్పుడు నాకు అనిపించింది.

మా నాన్న దగ్గరికి వెళ్లి .. "నాన్న నువ్వు బ్రతకాలి .. నా కోసం బ్రతకాలి. నా ద్వారానే నీకు కోవిడ్ వచ్చింది. నీకేమైనా అయితే జీవితాంతం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది . అందువలన ప్లీజ్ నాన్న నువ్వు కోలుకోవడానికి ప్రయత్నించు" అని ఏడ్చాను. ఆ తరువాత ఆయన లేవడం ..  కూర్చోవడం .. నడవడం .. మొదలుపెట్టారు. అప్పటికే తన లంగ్స్ చాలావరకూ పాడైనప్పటికీ, ఈ సినిమాలో ఆ పాత్ర  సహజత్వం  దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆయన సిగరెట్ త్రాగారు. అంటూ ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల  నేపథ్యంలో వచ్చే  'ఎన్ని జన్మల వరమో ఏమోగానీ .. నాన్నవయ్యావు' అంటూ పాడేసరికి, అంతా కూడా ఎమోషనల్ అయ్యారు.    
Tags:    

Similar News