మరోవారం రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి పండుగ చేసుకోనున్నారు ప్రజలు. చిచ్చుబుడ్లు - మతాబులు - థౌజండ్ వాలా - టెన్ థౌజండ్ వాలా.. ఇలా ఎవరికి తోచిన రీతిలో సామర్ధ్యం మేరకు పండుగకు రెడీ అవుతున్నారు. దీపావళి విషయంలో ఎంత సందడి - సంబరం ఉంటాయో.. అంతకు మించిన జాగ్రత్తలుండాలి. లేకపోతే గాయాలపాలవుతారు ప్రజలు.
ఇలా జరక్కుండా ఉండేందుకు ఫలానా జాగ్రత్తలు తీసుకోండి అంటూ వెండితెర వేల్పులు చెప్పడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటోంది. దీపావళిపై ప్రత్యేకంగా రూపొందిన ఓ అవగాహనా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శృతిహాసన్. తమిళనాడు ప్రభుత్వానికి చెందిన అగ్నిమాపక విభాగం.. ఈ మేరకు శృతిని కోరగానే.. వెంటనే అంగీరించేసి, వెంటవెంటనే షూటింగ్ కూడా పూర్తి చేసేసిందట. ఈ వారమంతా టీవీలు - రేడియోలు - ఇంటర్నెట్ ద్వారా ఈ మెసేజ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. పేపర్లలోనూ పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. అందం, అభినయంతోపాటు.. మంచి మనసు కూడా తనకుందని నిరూపించుకుంటోంది శృతిహాసన్.
ప్రభుత్వం రూపొందించే యాడ్స్ రెమ్యూనరేషన్ ఏమీ ఉండదు. గౌరవ పారితోషికం పేరుతో ఓ చిన్న మొత్తాన్ని ఇస్తారు కానీ.. దీన్ని సాధారణంగా వారు డొనేషన్ రూపంలో ఇచ్చేస్తుంటరు. అయినా సరే.. ఇలాంటి స్టార్ హీరోయిన్ ఇచ్చే మెసేజ్ ప్రజల్లోకి వేగంగా వెళ్తుందంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.