సెన్సార్ సర్టిఫికేషన్లో కొత్త అధ్యాయం

Update: 2016-06-11 06:20 GMT
సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లే కనిపిస్తోంది. మొన్న సీఎన్ ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల వేడుకకు హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. త్వరలోనే సెన్సార్ సర్టిఫికేషన్ కు సంబంధించి కీలకమైన మార్పలు చోటుచేసుకోబోతున్నాయని చెప్పినట్లు ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్ ట్విట్టర్లో వెల్లడించారు. ఇదే సమయంలో సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు నియమించిన కమిటీ ఇప్పటికే ఓ నివేదిక రూపొందించి త్వరలోనే కేంద్రానికి అందించబోతోంది. ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న లెజెండరీ డైరెక్టర్ శ్యామ్ బెనగల్.. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ సెన్సార్ విషయంలో చోటు చేసుకోబోతున్న ఓ కీలక మార్పులు వెల్లడించారు.

ప్రస్తుతం సినిమా ఎక్కువ హింసాత్మకంగా.. శృంగార భరితంగా ఉంటే ‘ఎ’ సర్టిఫికెట్ (అడల్ట్స్ ఓన్లీ) ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐతే హింస.. శృంగారం పాళ్లు మరీ శృతి మించి పోతే అలాంటి సినిమాలకు ‘ఎ/సి’ సర్టిఫికెట్ ఇవ్వాలని శ్యామ్ బెనగల్ కమిటీ కీలకమైన సిఫారసు చేసింది. ఎ/సి అంటే అడల్ట్స్ ఓన్లీ విత్ కాషన్ అని అర్థం. అంటే 18 ఏళ్లు నిండినవాళ్లు కూడా ఈ సినిమా చూడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని చెప్పడం అన్నమాట. ఈ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండేందుకు ఆస్కారముంటుంది. ప్రస్తుతం పెద్ద వివాదానికి కేంద్రంగా మారిన ‘ఉడ్తా పంజాబ్’ లాంటి సినిమాల్ని ఈ కేటగిరిలోకి చేర్చేయొచ్చు. ఇలాంటివి చూడాలా వద్దా అన్నది సర్టిఫికెట్ చూసి ప్రేక్షకులే నిర్ణయించుకోవడానికి ఆస్కారముంటుంది. ఈ సర్టిఫికెట్ ఉన్న సినిమాల్ని రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్న థియేటర్లలో ప్రదర్శించకూడదన్న షరతు కూడా పెట్టింది బెనగల్ కమిటీ.
Tags:    

Similar News