టిల్లు అన్న ఇక ఫుల్‌ బిజీ

Update: 2022-02-17 23:30 GMT
సిద్దు జొన్నలగడ్డ నటుడిగా 2009 జోష్‌ సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో కనిపించి లైఫ్ బిఫోర్‌ వెడ్డింగ్‌ సినిమా తో లీడ్ రోల్‌ పాత్రలు చేయడం మొదలు పెట్టాడు. హీరోగానే కాకుండా స్క్రిప్ట్‌ రైటర్ గా డైలాగ్‌ రైటర్ గా కూడా మంచి పేరును దక్కించుకున్నాడు. గుంటూరు టాకీస్ సినిమాతో మరింత క్రేజ్‌ ను దక్కించుకున్నప్పటికి ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు.

ఆ సినిమా క్రెడిట్‌ మొత్తం కూడా రష్మి గౌతమ్‌ కు వెళ్లడంతో జనాలకు సిద్దు ఎక్కువగా కనిపించలేదు. ఆ తర్వాత కృష్ణ అండ్‌ ఇజ్ లీలా మరియు మా వింత గాధ వినుమా సినిమాలతో ఈయన వచ్చాడు. కాని ఆ రెండు సినిమాలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా కూడా ఓటీటీ రిలీజ్ అవ్వడం వల్ల జనాల్లో రిజిస్టర్‌ అవ్వలేక పోయాడు. ఎట్టకేలకు డీజే టిల్లు సినిమా తో సిద్దు కు అసలైన సక్సెస్ దక్కింది.

హీరోగా డీజే టిల్లు సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించి భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. ఈ సమయంలో సిద్దు పై బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాతల కన్ను పడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నిర్మాతలు ఆయన్ను అప్రోచ్‌ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొందరు దర్శకులు ఆయన కోసం కథలు రెడీ చేసుకుంటున్నారట.

మరో విజయ్ దేవరకొండ అంటూ టిల్లు అన్న గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అతడి నాచురల్‌ యాక్టింగ్‌ మరియు యాటిట్యూడ్‌ యూత్‌ కు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉందని టాక్‌ వినిపిస్తుంది. మరో రెండు మూడు డీజే టిల్లు తరహా సక్సెస్ లు పడ్డట్లయితే సిద్దు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా స్టార్‌ గా దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా వస్తున్న ఆఫర్లలో ఏదో ఒక సినిమాను త్వరలోనే ఈయన కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ కూడా ఫుల్‌ బిజీగా మారబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికే మెహబూబా ఇంకా కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆ సినిమా లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. డీజే టిల్లు ఆమెకు మొదటి కమర్షియల్‌ సక్సెస్ ను తెచ్చి పెట్టింది.

కనుక రాబోయే రోజుల్లో హీరోయిన్‌ గా నేహా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆమెకు కూడా ఆఫర్లు వస్తున్నాయి. కాని కాస్త ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకునే ఉద్దేశ్యంతో ఇంకా కొత్త సినిమాకు సైన్ చేయలేదట. మొత్తానికి డీజే టిల్లు సినిమా తో ఒకే సారి ఇద్దరు అంటే సిద్దు మరియు నేహా లకు బ్రేక్ దక్కినట్లయ్యింది. ఇక ముందు వారు ఇద్దరు కూడా ఫుల్‌ బిజీగా ఇండస్ట్రీలో దూసుకు పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Tags:    

Similar News