కుల జాడ్యాన్ని క‌డిగేసిన టాలీవుడ్ సింగ‌ర్!

Update: 2018-09-17 07:17 GMT
మిర్యాల‌గూడ లో జ‌రిగిని ప్ర‌ణ‌య్ కుల ఆధిప‌త్య ప‌రువు హ‌త్య ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ప‌ట్ట‌ప‌గ‌లు అత్యంత పాశ‌వికంగా దారుణ హ‌త్య‌కు గురైన ప్రణయ్ హత్యోదంతంపై ప‌లువురు సంఘీభావం ప్ర‌క‌టించారు. ఇటువంటి ప‌రువు హ‌త్య‌ల‌ను ముక్త‌కంఠంతో ఖండించారు. తాజాగా, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా ఈ దారుణ హ‌త్య‌ను ఖండించింది. ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై స్పందించిన చిన్మయి...త‌న ఫేస్‌ బుక్ ఖాతాలో ఓ లేఖను పోస్ట్  చేసింది. తమిళనాడులో సంచ‌ల‌నం రేపిన కౌసల్య-శంకర్‌ ల హత్యతో ప్రణయ్ హత్యను చిన్మ‌యి పోల్చింది. దేశంలో కులం జాడ్యం విచ్చ‌ల‌విడిగా విస్తరించిందని - కులం పేరు చెప్పుకోకుండా మ‌నుగ‌డ సాగించ‌లేని ప‌రిస్థితిని కొంద‌రు క‌ల్పించార‌ని ఆవేదన వ్యక్తం చేసింది.

కులం పేరుతో దేశంలో నిత్యం అనేక‌ దారుణాలు జరుగుతున్నాయని....నీటికి - మట్టికి కులం సర్టిఫికెట్ ఇవ్వడంలో భారతీయులు విజయవంతమయ్యారని చిన్మ‌యి ఎద్దేవా చేసింది. పేరు చివర తోకలను కత్తిరిస్తేనే కుల జాడ్యం పోతుంద‌ని చెప్పింది. పెళ్లి సంబంధాల్లో కులంతో పాటు ఆర్థిక స్థితిగతులు - ప‌లుకుబ‌డి - అమెరికా వీసా వంటివి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని విమ‌ర్శించింది. పెళ్లి ఖర్చుల్లో అమ్మాయి-అబ్బాయిలది చెరో సగం అనే వారు ఎంత‌మంది అని ప్ర‌శ్నించింది. కుల పిచ్చి అన్ని మతాల్లోనూ ఉందని, దానిని నిర్మూలించడం ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఎవ‌రైనా కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దానిని సున్నితంగా తోసిపుచ్చాలని - త‌మ కులం పేరు తెలియదని చెప్పి త‌ప్పించుకోవాల‌ని సూచించింది. విరివిగా పుస్తకాలు చదవడం - సోషల్ మీడియాలో కుల మ‌తాల‌కు సంబంధించిన పోస్టుల‌కు వీలైనంత దూరంగా ఉండాల‌ని సూచించింది.

Tags:    

Similar News