ఆ సింగర్ ది మామూలు మరణమేనా?

Update: 2015-10-24 04:50 GMT
బాలీవుడ్ పాటలు వినేవాళ్లకు లబ్ జాంజువా గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ‘సింగ్ ఈజ్ కింగ్’ సినిమలో జీ కర్దా పాట విన్నా.. ‘జబ్ వుయ్ మెట్’లో మౌజా హి మౌజా పాట చెవిన పడ్డా.. ‘రబ్ నే బనాదె జోడీ’లో డాన్స్ పె ఛాన్స్ పాట విన్నా.. వెంటనే జాంజువా గుర్తొచ్చేస్తాడు. ఐతే ఈ పంజాబీ గాత్రం హఠాన్మరణం పాలవడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఈ సీనియర్ సింగర్ ఢిల్లీలోని గుర్గావ్‌ లో తన ఇంట్లోనే శవమై కనిపించడం సంచలనమైంది. అనారోగ్యంతోనే అతను మరణించినట్లు చెబుతున్నప్పటికీ.. ఎవరైనా అతణ్ని చంపేశారా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

బుధవారం రాత్రి జాంజువా భార్య ఇంట్లో లేని సమయంలో అతను అనారోగ్యం పాలయ్యాడు. ఈ సంగతి భార్యకు ఫోన్ చేసి చెబితే.. ఆమె తెలిసిన వ్యక్తిని పురమాయించింది. అతనొచ్చి జాంజువాను ఆసుపత్రికి తీసుకెళ్లి.. తిరిగి ఇంట్లో దిగబెట్టాడు. ఉదయం ఎవరో వచ్చి తలుపు కొట్టినా ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు రావాల్సి వచ్చింది. వాళ్లు తలుపు బద్దలు కొట్టి చూడగా.. జాంజువా బెడ్డుపై శవమై కనిపించాడు. అనారోగ్యమే ఆయన మృతికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ.. తన పరిస్థితి దిగజారినపుడు జాంజువా మళ్లీ భార్యకు కాల్ చేయకపోవడం కొంత అనుమానాలకు తావిస్తోంది. మరి ఈ కేసులో పోలీసులు ఏం తేలుస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News