డెబ్యూ డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఇంట్రెస్టింగ్

Update: 2016-01-16 20:14 GMT
కళ్యాణ్ కృష్ణ.. నిన్నట్నుంచి ఈ పేరు టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది. నాగార్జున లాంటి సీనియర్ హీరోను మెప్పించి.. ఆయన సొంత బేనర్లో దర్శకుడిగా తన తొలి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ను నిర్మించేలా ఒప్పించడమే కాదు.. ఆ సినిమా తీసి హిట్టు కూడా కొట్టాడీ యంగ్ డైరెక్టర్. ఐతే కళ్యాణ్ గురించి ఇండస్ట్రీలో పెద్దగా తెలియదు. అతను ఏ సినిమాకూ పని చేసినట్లు కూడా చెప్పట్లేదు. మరి ఈ కుర్రాడు నాగ్ కళ్లల్లో ఎలా పడ్డాడు.. ఆయన్ని మెప్పించి ఎలా అవకాశం దక్కించుకున్నాడు అన్నది ఆసక్తికరం.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కళ్యాణ్ కృష్ణ ఇంటి పేరు కురసాల. ఈ ఇంటి పేరుతో ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్న సంగతి పొలిటికల్ సర్కిల్స్ లో బాగానే తెలిసి ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కురసాల కన్నబాబు గుర్తున్నాడా? ఆయన సొంత తమ్ముడే ఈ కురసాల కళ్యాణ్ కృష్ణ. ఒకప్పుడు ‘ఈనాడు’ పత్రికలో రిపోర్టర్ గా పెద్ద స్థాయిలో పని చేశాడు కన్నబాబు. పొలిటికల్ లీడర్స్ తో మంచి సంబంధాలు నెరిపి.. చిరంజీవి పార్టీ పెట్టే సమయంలో ఆయనకు చేరువైన కన్నబాబు, టికెట్ సంపాదించి ఎమ్మెల్యే కూడా అయ్యాడు. చిరంజీవి పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మంత్రి కూడా అయ్యేవాడేమో.

చిరంజీవితో ఉన్న పరిచయంతోనే ఆయన రెఫరెన్స్ తో తమ్ముడిని నాగార్జునకు పరిచయం చేశాడు కన్నబాబు. ఇక కళ్యాణ్ నాగ్ దగ్గర తన టాలెంట్ చూపించి అవకాశం దక్కించుకున్నాడు. ‘ఉయ్యాల జంపాల’ నిర్మాత రెండు పేజీల కథ రాసిస్తే.. 15 రోజుల్లో డైలాగ్ వెర్షన్ తో సహా పక్కా స్క్రిప్టు రెడీ చేసి నాగ్ ను మెప్పించి దర్శకుడిగా ఛాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రేక్షకుల్నీ మెప్పించాడు. కళ్యాణ్ రెండో సినిమా కూడా నాగ్ తోనే చేయొచ్చని సమాచారం.
Tags:    

Similar News