కొంద‌రు నిర్మాత‌లు కాస్టింగ్ ఏజెంట్ల‌తో స‌మ‌స్య‌!

Update: 2022-06-23 03:30 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్న తాజా సంక్షోభం గురించి తెలిసిందే. క‌రోనా క్రైసిస్ తొల‌గిపోయింది. షూటింగులు చేస్తూ రిలీజ్ ల‌తో అంతా స‌జావుగా సాగుతోంది అనుకుంటుండ‌గానే ఊహించ‌ని పిడుగులా టాలీవుడ్ లో 24 శాఖ‌ల కార్మికులు స‌మ్మె చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వేత‌న స‌వ‌ర‌ణ‌పై నిర్మాత‌లు దిగి రావాల్సిందేనంటూ కార్మికులు హుకుం జారీ చేసారు. నేడు బంద్ ని విజ‌య‌వంతంగా నడిపించారు. ఫెడ‌రేష‌న్ పెద్ద‌లు ఛాంబ‌ర్ - గిల్డ్ పెద్ద‌ల‌తో ముచ్చ‌టిస్తున్నా కానీ ఏదీ ఒక కొలిక్కి రావ‌డం లేదు.

ఇక షూటింగుల్లేక కొంద‌రు హీరోలు ఇత‌ర వ్య‌క్తిగ‌త‌ వ్య‌వ‌హారాల‌పై దృష్టి సారించారు. స‌ల్మాన్ భాయ్ లాంటి స్టార్ హీరో హైద‌రాబాద్ లో షూటింగుకి బ్రేక్ వేసి మొక్క‌లు నాటే ప‌నిలో ప‌డ్డారు. అదంతా అటుంచితే ప్ర‌స్తుత బంద్ వెన‌క కార్మికుల వైపు నుంచి మ‌రో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. ఇది అంద‌రికీ తెలిసిన‌దే అయినా కానీ సొల్యూష‌న్ లేని స‌మస్య‌గానే మిగిలిపోయింద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

టాలీవుడ్ లో జీత‌భ‌త్యాల్ని కార్మికుల‌కు స‌కాలంలో చెల్లించే కంపెనీలు కొన్ని మాత్ర‌మే ఉన్నాయ‌ని కొంద‌రు కార్మికులు నివేదిస్తున్నారు. టైమ్ కి ఇచ్చిన మాట ప్ర‌కారం చెల్లించే అగ్ర బ్యాన‌ర్లు కొన్ని ఉన్నాయి. కానీ చాలా మంది నిర్మాతలు భ‌త్యాల చెల్లింపులో ఆల‌స్యం చేస్తుంటారు. కొంద‌రు అయితే ఇస్తారో లేదో కూడా చెప్ప‌లేని స‌న్నివేశం కొన్నిసార్లు ఎదుర‌వుతుంటుంద‌ని ఆ స‌మ‌యంలో కుటుంబ పోష‌ణ భారంగా మారుతోంద‌ని ఓ కార్మికుడు మీడియాతో ఆవేద‌న వెలిబుచ్చాడు.

భ‌త్యం పెంపు అనేది అటుంచితే బ‌తుకు న‌డిపించేందుకు అవ‌స‌ర‌మైన భ‌త్యం (డైలీ వేజెస్) కూడా కొంద‌రు స‌రిగా చెల్లించ‌ర‌నేది అత‌డి ఆరోప‌ణ‌. ఇక‌పోతే కాస్టింగ్ ఏజెంట్లు మ‌ధ్య‌వ‌ర్తులు నిర్మాత చెల్లించే మొత్తాన్ని నేరుగా కార్మికుడికి అంద‌జేయ‌రు. దానినుంచి ప‌ర్సంటేజీ పేరుతో కోత పెట్టి చెల్లిస్తుండ‌డంతో అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు చాలీ చాల‌క‌ తీవ్ర‌మైన ఇబ్బంది ఎదుర‌వుతోంది.

ఏదో ఒక శాఖ‌లో స‌భ్య‌త్వం ఉన్న కార్మికుల వ‌ర‌కూ సేఫ్ అవుతున్నా కానీ అసంఘ‌టితంగా ఉండే కార్మికుల‌కు ఎప్పుడూ జీత‌భ‌త్యాల ప‌రంగా గ్యారెంటీ అయితే లేద‌ని కూడా నివేదిస్తున్నారు. ఈ వృత్తిని న‌మ్ముకుని ఫిలింన‌గ‌ర్ యూస‌ఫ్ గూడ‌లో వంద‌లాది మంది అసంఘ‌టిత కార్మికులు జీవ‌నం వెల్ల‌దీస్తున్నారు.

ఇక క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రూ.5 భోజ‌నంతో బ‌తికిన వాళ్లు కూడా ఉన్నార‌ని ఫిలింన‌గ‌ర్ లో ఒక కార్మికుడు వెల్ల‌డించ‌డంటే స‌న్నివేశం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌లతో క‌రోనా క్రైసిస్ క‌ల్లోలం లో ఇలాంటి కుటుంబాలు ఎన్నో రోడ్డున ప‌డ్డాయ‌ని కూడా కొంద‌రు చెబుతున్నారు. అయితే ఈ త‌ర‌హా కార్మికుల‌ను ఆదుకునేందుకు ఛాంబ‌ర్ వ‌ద్ద కానీ నిర్మాల మండ‌లి లో కానీ ఎలాంటి ఏర్పాటు లేదు. ప్ర‌తిపాద‌న‌లు కూడా ఏవీ లేవ్.
Tags:    

Similar News