ఇలాంటప్పుడు ఎవరో రాసింది చదవాల్సిందేనా?

Update: 2015-12-19 12:06 GMT
సాదాసీదా వ్యక్తులకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చినా.. కోర్టు గుమ్మం తొక్కటం అవమానకరంగా భావిస్తారు. బాధితుడిగా పోలీస్ స్టేషన్.. కోర్టుకు వెళ్లటం అదో రకం.కానీ.. నిందితుడి హోదాలో వెళ్లటాన్ని ఓ పట్టానా జీర్ణం చేసుకోలేరు. సాదీసీదా వ్యక్తులకు ఇలాంటి పరిస్థితే ఉంటే.. ఇంత పెద్ద దేశాన్ని కనుసైగతో శాసించిన సోనియాగాంధీ కోర్టు గుమ్మం ఎక్కాల్సి రావటం ఏమిటి? కోర్టుకు వెళ్లక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి.. బెయిల్ పిటీషన్ దాఖలు చేయకుంటే.. నేరుగా జైలుకెళ్లే దుస్థితి.

ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఆవేశం ఒక రేంజ్ లో ఉంటుంది. అందరిలానే రాజ్యాంగం తమకూ సమానమం అని మాట వరసకు చెప్పినప్పటికీ.. తమ లాంటి వారిని పాటియాలా హౌస్ కోర్టు గమ్మం వరకూ తీసుకురావటాన్ని సోనియా.. రాహుల్ గాంధీలు ఇప్పట్లో మర్చిపోలేరు.ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఎదురైనప్పుడు.. తమ ఆవేదనను అలవోకగా వెళ్లగక్కేస్తుంటారు. ఒకవేళ.. అలాంటి పనే చేస్తే ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎందుకు అవుతారు?

దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన రాజకీయ పార్టీగా.. శతాధిక వయసున్న పార్టీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు హాజరైన ఆమె.. కోర్టు నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీనియర్ నేతలతో సమావేశమైన ఆమె.. అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.

తన జీవితంలో కోర్టు గుమ్మం ఎక్కుతానన్న ఊహ కూడా సోనియమ్మకు వచ్చి ఉండదేమో. అలాంటి ఆమె కోర్టుకు వెళ్లటమే కాక.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించాల్సిన పరిస్థితికి కరుణించిన జడ్జి బెయిల్ మంజూరు చేయటంతో బయటకు వచ్చిన ఆమె.. ఎవరో రాసిచ్చిన కాగితాన్ని చదవటం మొదలు పెట్టారు.

‘‘కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉంది. దేశ పౌరులుగా ఏం చేయాలో మేం కూడా అదే చేశాం. చట్టాన్ని గౌరవిస్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. కేసులకు భయపడేది లేదు. స్వచ్ఛమైన మనసుతో కోర్టుకు హాజరయ్యాం. రాజకీయ ప్రతీకార చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం’’ అంటూ చదివేశారు. సోనియా మాట్లాడుతున్నంత సేపు ఆమె వెనుకనే పదేళ్లు ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ ఉంటే.. ఆమె పక్కన రాహుల్ నిలబడి ఉన్నారు. భావోద్వేగ సమయంలోనూ అలవోకగా మాట్లాడలేని భావ దారిద్ర్యమేందో..?
Tags:    

Similar News