చిన్న సినిమా చితగ్గొట్టేసింది

Update: 2018-03-06 08:01 GMT
గత ఏడాది బాలీవుడ్ కు చాలా వరకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ సినిమాలు తుస్సుమనిపించాయి. ఐతే కొత్త ఏడాదిలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. జనవరి నెలాఖర్లో విడుదలైన ‘పద్మావత్’ మంచి వసూళ్లతో పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ సినిమా ‘ప్యాడ్ మ్యాన్’ కూడా మంచి ఓపెనింగ్సే తెచ్చుకుంది. వీటి తర్వాత ఒక చిన్న సినిమా అక్కడ చితగ్గొట్టేస్తోంది. పేరున్న నటీనటులు.. టెక్నీషియన్లు లేకపోయినప్పటికీ.. కేవలం కంటెంటుతోనే ప్రేక్షకుల్ని మెప్పిస్తూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆ సినిమా పేరు ‘సోను కే టిటు కీ స్వీటీ’.

లవ్ రంజన్ అనే దర్శకుడు రూపొందించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘సోను కే టిటు కీ స్వీటీ’. కార్తీక్ ఆర్యన్.. నుష్రత్ భరూచా.. సన్నీ నిజార్ కీలక పాత్రలు పోషించారు. ఈ దర్శకుడు ఇంతకుముందు కూడా సినిమాలు తీశాడు కానీ.. అవేమంత పేరు తెచ్చిపెట్టలేదు. ఇక హీరో హీరోయిన్లు కొత్త వాళ్లు. సినిమా మరీ కొత్తగా ఏమీ ఉండదు. కానీ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఈ చిత్రం యువ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 23న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. విడుదలైన పదో రోజు ఈ చిత్రం రూ.7.5 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిందంటే.. అవి తొలి రోజు వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయంటే దీని జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ‘పద్మావత్’.. ‘ప్యాడ్ మ్యాన్’ల తర్వాత ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న ‘సోను కే టిటు కీ స్వీటీ’.. త్వరలోనే ‘ప్యాడ్ మ్యాన్’ను కూడా దాటేసి రెండో స్థానానికి చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News