బాలీవుడ్ నటుడు సోనుసూద్ నటుడిగా కంటే గొప్ప ప్రజా సేవకుడిగా దేశ ప్రజల మనసుల్లో ముద్ర వేసారు. అప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు..చారిటీ ఈవెంట్లు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది చిన్నారుల్ని ఆదుకున్నారు. కానీ అవేవి వెలుగులోకి రాలేదు. కరోనా రాకతోనే సోనూసూద్ లో సేవా దృక్ఫథం ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికుల్ని ప్రత్యేక బస్సులేసి స్వస్థలాలకు తరలించి రియల్ హీరో అయ్యారు. ఈ ఒక్క ఘటన సోనుసూద్ ని ప్రజల్లో దేవుణ్ణి చేసింది. ప్రభుత్వమే ఎలాంటి చర్యలు తీసుకోకుండా గమ్మునుంటే సోనుసూద్ మాత్రం నేను ఉన్నానంటూ ముందుకొచ్చి అదుకున్నాడు.
అటుపై సోషల్ మీడియా వేదికగా అవసరమైన రోగులకు కావాల్సిన మందులు సొంత డబ్బుతో కొనుగోలు చేసి పంపించడం నుంచి కరోనా రక్కసి ప్రాణాలు తీస్తున్న సమయంలో ఆక్సీజన్ సిలిండర్లు ఏర్పాటు చేయడం వరకూ ఎన్నో సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
`మానవ సేవయే మాధవ` సేవ అన్న నానుడి సరిగ్గా సోనూసూద్ కి సరిపోయే తీరున ఆయన సేవలు కరోనా సమయంలో కొనసాగాయి. ఇందులో రాజకీయ కోణం ఉందా? ఇంకేదైనా ఉందా? అన్నది పక్కన బెడితే సోన్ సూద్ రూపంలో సేవలందుకున్న వారికి మాత్రం ఆయన దేవుడనే చెప్పాలి.
అప్పటి నుంచి సోనూసూద్ సేవాక కార్యక్రమాలు మరింత విస్తృతం అవుతున్నాయి. తాజాగా సోనూసూద్ చారిటీ పౌండేషన్ `అడాప్ట్ ఏ పేషెంట్` కి పిలుపునిచ్చారు. `హెల్ప్ మీ సేవ్ వన్ మోర్ లైఫ్ టు డే` అంటూ సేవా దృక్ఫథం ఉన్న వాళ్లకు సూద్ చారిటీ ఆహ్వానం పలుకుతుంది.
`నేను ప్రతిరోజూ వేలాది అభ్యర్థనలను స్వీకరిస్తాను మరియు నేను వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ.. నువ్వు నాతో చేతులు కలపకుండా ఈ ప్రయాణం పూర్తి కాదు. మరో ప్రాణాన్ని రక్షించడంలో నాతో చేరండి` అని ట్వీటర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసారు.
సోనుసూద్ పక్కన ఉన్న వందలాది పేషెంట్ అప్లికేషన్స్ పరిశీలించ వచ్చు. చేయి చేయి కలిస్తేనే ఏ పని అయినా సులభం అవుతుంది. మరింత మందికి సహాయం అందుతుంది. మరికొన్నాళ్ల పాటు చారిటీ కార్యక్రమాలు నిర్విరామంగా సాగడానికి అవకాశం ఉంటుంది. మరి సోనుసూద్ తో ఎంత మంది చేతులు కలుపుతారో చూద్దాం. మానవ సేవయే మాధవ సేవ అని ఇంకెంత మంది ముందుకొస్తారో వెయిట్ చేద్దాం.