మూవీ రివ్యూ : సౌఖ్యం

Update: 2015-12-24 11:22 GMT
చిత్రం : సౌఖ్యం

నటీనటులు: గోపీచంద్ - రెజీనా - ప్రదీప్ రావత్ - ముకేష్ రుషి - పృథ్వీ - పోసాని కృష్ణమురళి - బ్రహ్మానందం - సప్తగిరి - జయప్రకాష్ రెడ్డి - రఘుబాబు - సత్యకృష్ణ - శివాజీ రాజా - సురేఖా వాణి - కృష్ణభగవాన్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ - మాటలు: శ్రీధర్ సీపాన
స్క్రీన్ ప్లే: కోన వెంకట్ - గోపీమోహన్
దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి

పుష్కరం కిందట ‘యజ్నం’ సినిమాతో హీరోగా గోపీచంద్ కు - దర్శకుడిగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తమ కెరీర్ లకు బలమైన పునాదులు వేసుకున్నారు. ఐతే మధ్యలో గాడి తప్పిన వీళ్లిద్దరి కెరీర్లు గత ఏడాదే మళ్లీ దారిలోకి వచ్చాయి. ‘లౌక్యం’తో గోపీచంద్ - ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో చౌదరి ఫామ్ అందుకుని.. ఒకప్పటి తమ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను తిరిగి ‘సౌఖ్యం’తో తెరమీదికి తెచ్చారు. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

శీను (గోపీచంద్) రైల్లో పరిచయమైన శైలజ (రెజీనా)ను ప్రేమిస్తాడు. ముందు అతడికి నో చెప్పినా తర్వాత ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే కొందరు రౌడీలొచ్చి ఆమెను ఎత్తుకెళ్లిపోవడంతో తన కోసం వెతుకుతుంటాడు శీను. ఇంతలో తన తండ్రిని కాపాడిన బావూజీ (ప్రదీప్ రావత్) అనే రౌడీకి ఇచ్చిన మాట మేరకు కలకత్తా నగరంలో పెద్ద డాన్ అయిన పీఆర్ (దేవన్) కూతుర్ని తీసుకురావడానికి అక్కడికెళ్తాడు శీను. తీరా అక్కడికెళ్లి చూస్తే తను ప్రేమించిన శైలజే పీఆర్ కూతురని తెలుస్తుంది శీనుకి. మరి శీను.. పీఆర్ - బావూజీలను ఎలా బోల్తా కొట్టించి శైలజను తనదాన్ని చేసుకున్నాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్ని సినిమాలు రొటీన్ గానే అనిపించినా పెద్ద హిట్ చేసేస్తారు ప్రేక్షకులు. అదే సమయంలో కొన్ని రొటీన్ సినిమాల్ని దారుణంగా తిప్పి కొడుతుంటారు. ఐతే ‘రొటీన్’ అనేది ఎంత మోతాదులో ఉంది? రొటీన్ కథాకథనాల్నే వినోదం జోడించి ఎంత కన్విన్సింగ్ గా చెప్పారు అన్నది ఇక్కడ కీలకమైన పాయింటు. గత ఏడాది ‘లౌక్యం’ సినిమా ఇలాగే జనాలకు కన్విన్సింగ్ గా అనిపించింది. అందులోని వినోదం నచ్చింది. అందుకే ఆ సినిమా పెద్ద హిట్టయింది. ‘సౌఖ్యం’ సినిమా చూస్తుంటే ‘లౌక్యం’ను చూసి వాత పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది తప్పితే.. ఏ విషయంలోనూ కాస్తయినా ‘లౌక్యం’ ప్రదర్శించినట్లుగా అనిపించదు. టైటిల్ సౌండింగ్.. డిజైన్.. ప్రోమోస్ అన్నీ కూడా ‘లౌక్యం’ను తలపించాయి కానీ.. సినిమా మాత్రం ఏ విధంగానూ ‘లౌక్యం’ దరిదాపుల్లోకి కూడా రాలేదు.

హీరో రోడ్డు మీద వీరంగం చేస్తున్న విలన్ కొడుకుని చితకబాదుతాడు. ఇక ఆ విలన్ గ్యాంగంతా కలిసి ఇతణ్ని వెతుకుతుంటుంది.. సరిగ్గా ఇంటర్వెల్ పాయింట్ దగ్గర హీరో వాళ్లకు దొరుకుతాడు.. అక్కడో పెద్ద ఫైటింగ్. పెద్ద పోటుగాడైన విలన్ ఇంట్లోకి చీమ కూడా వెళ్లడానికి వీలుండదు. కానీ హీరో ఓ బకరాను అడ్డం పెట్టుకుని లోపలికెళ్లి దర్జాగా హీరోయిన్ని బయటికి తెచ్చేస్తాడు. హీరో హీరోయిన్ని తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టి డ్రామా ఆడిస్తాడు. ఆమె అందరినీ బుట్టలో వేసేస్తుంది. హీరో తండ్రి చివర్లో నిజం తెలుసుకుని క్షమించేస్తాడు. గత దశాబ్ద కాలంలో ఈ తరహా కాన్సెప్ట్స్ ఎన్ని సినిమాల్లో ఉన్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని చూడండి. సౌఖ్యం ఎంత రొటీన్ గా ఉండుంటుందో ఓ అంచనా వచ్చేస్తుంది.

ఎంత రొటీన్ కథను ఎంచుకున్నప్పటికీ స్క్రీన్ ప్లేలో అయినా కొన్ని సర్ ప్రైజ్ లు ఉండేలా చూసుకోవాలి. కానీ అలాంటి సర్ ప్రైజ్ లు ఏమీ లేకపోవడంతో ‘సౌఖ్యం’ మనకిచ్చే సర్ ప్రైజ్. కోన వెంకట్ - గోపీమోహన్ ల పెన్నుల్లో ఇంకు క్రమంగా తగ్గిపోతోందనడానికి ‘సౌఖ్యం’ మరో రోజువు. శ్రీధర్ సీపాన కథ ఎంత రొటీన్ గా ఉందో స్క్రీన్ ప్లే కూడా అలాగే తయారైంది. సినిమా మొదలయ్యాక ఓ 20 నిమిషాలు మాత్రమే ‘సౌఖ్యం’ కొంత ఎంగేజ్ చేస్తుంది. ఆ కాస్త సమయంలో జయప్రకాష్ రెడ్డి - పోసాని కృష్ణమురళి కాస్త ఎంటర్ టైన్ చేస్తారు. ఐతే హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ మొదలవగానే ప్రేక్షకుడికి ‘సౌఖ్యం’ ఎగిరిపోతుంది. అసలేమాత్రం ఫీల్ లేని, కన్విన్సింగ్ గా లేని లవ్ స్టోరీ అరగంట పాటు విసిగిస్తుంది. అతి కష్టం మీద ప్రథమార్ధం వరకు బండి లాగించిన దర్శకుడు.. ద్వితీయార్ధంలో పూర్తిగా చేతులెత్తేశాడు.

పృథ్వీ వస్తాడు ఏదో చేస్తాడనుకుంటే.. ట్రైలర్లో చూపించిందానికి మించి అతను చేసిందేమీ లేదు. ఎంట్రీ మినహాయిస్తే పృథ్వీ పాత్రలో చెప్పుకోవడానికేం లేదు. చివర్లో బ్రహ్మిని తీసుకొచ్చి అర్థం పర్థం లేని సిల్లీ కామెడీ చేయించారు. అది కామెడీ ఛానెల్లో బిట్టుగా వేసుకోవడానికి బావుంటుంది కానీ.. సినిమాలో మాత్రం సింక్ అవ్వలేదు. సప్తగిరి కామెడీ కూడా అలాగే తయారైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ పండించే ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. విలనిజం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మలయాళ విలన్ దేవన్ పాత్రకు ఎంట్రీలో ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. కానీ ఆ పాత్రను తుస్సుమనిపించారు.

తెరమీద బోలెడంత మంది తారాగణం.. అందులోనూ కమెడియన్లకు లెక్కే లేదు. తెరమీద చాలా హడావుడైతే కనిపిస్తుంది కానీ.. అసలు ‘విషయం’ లేనపుడు ఎంతమందుంటే ఏం లాభం? కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, గ్లామర్.. ఇలా అనేక లెక్కలేసుకుని వంటకం వండారు కానీ ఈ దినుసులన్నీ కూడా ఎక్స్ పైర్ దాటిపోవడంతో వంటకం చేదుగా తయారైంది.

నటీనటులు:

‘లౌక్యం’ ఇచ్చిన ఉత్సాహంతో గోపీచంద్ కాన్ఫిడెంట్ గా నటించాడు. లుక్ మరింత మెరుగు పరుచుకుని.. డ్యాన్సులు - ఫైట్ల విషయంలోనూ మరింత శ్రద్ధ పెట్టాడు. కానీ అతడి పాత్రలో ఏ ప్రత్యేకతా లేకపోయింది. రెజీనా చేసిన సినిమాలన్నింట్లో ఏమాత్రం విషయం లేని పాత్ర ఇదే. ఆమె టాలెంట్ ఏమాత్రం వాడుకోకుండా ఉత్సవ విగ్రహాన్ని చేసేశారు. పృథ్వీ - బ్రహ్మానందం స్పూఫ్ కామెడీతో కొంతవరకు నవ్వించారు కానీ.. వాళ్ల పెర్ఫామెన్స్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. సప్తగిరి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చి.. కొన్ని నిమిషాలకే కనుమరుగైపోయాడు. పోసాని ఉన్నంత సేపు తనదైన స్టయిల్లో డైలాగులు చెబుతూ నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పాత్రను కూడా ఓ పది నిమిషాలకే పరిమితం చేశారు. విలన్ పాత్రలన్నింటినీ జోకర్లుగా మార్చేశారు. దేవన్ - ప్రదీప్ రావత్ చేయడానికేమీ లేకపోయింది.

సాంకేతికవర్గం:

సినిమాలో ఎక్కువ మార్కులు ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రహణానికే దక్కుతాయి.  తాను పని చేసే సినిమాలన్నింటికీ ఓ రిచ్ నెస్ తీసుకొచ్చే ప్రసాద్.. ఈ సినిమాలోనూ అదే పనితనం చూపించాడు. అనూప్ రూబెన్స్ పాటల్లో దేవుడా, సిండ్రెల్లా.. బావున్నాయి. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా సాదాసీదాగా ఉంది. చాలా మొక్కుబడిగా పాత సినిమాల్లోని సౌండ్ లనే రిపీట్ చేసినట్లుగా అనిపిస్తుంది. శ్రీధర్ సీపాన కథ, మాటలు రెండూ కూడా పరమ రొటీన్. కోన వెంకట్-గోపీ మోహన్ స్క్రీన్ ప్లే కూడా అంతే. భవ్య క్రియేషన్స్ స్టాండర్డ్స్ కు తగ్గట్లు నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. మాస్ సినిమాల్లో తన ప్రత్యేకత చూపించే ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తనకు నప్పని కామెడీ ఎంటర్ టైనర్ సబ్జెక్టును సరిగా డీల్ చేయలేకపోయాడు. విషయం లేని దేవన్ పాత్రకు అతనిచ్చిన బిల్డప్.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు చూస్తేనే.. ఈ సబ్జెక్ట్ తన ‘కప్ ఆఫ్ టీ’ కాదని.. సినిమా టోన్  అర్థమైపోతుంది.

చివరగా: సౌఖ్యమా.. నీ జాడెక్కడ?

రేటింగ్:  1.75/5
Tags:    

Similar News