థియేటర్ ముందు ‘‘హౌస్ ఫుల్.. హాలు నిండినది’’ అనే బోర్డు ఉండాలని థియేటర్ యాజమాన్యాలు.. ఇండస్ట్రీ ఎప్పుడూ కోరుకుంటాయి. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి గమనిస్తే మార్చి 1 తరవాత కొత్త బోర్డు కనిపించేలా ఉంది. ‘హౌస్ క్లోజ్.. హాలు మూసివేయబడినది’. ఇది ఇంతవరకు తెలుగు రాష్ట్రాల వరకు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మొత్తం సౌత్ థియేటర్లు మొత్తం ఇదే దారిలో నడుస్తుండటం విశేషం.
థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్టర్లు వచ్చాక డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల పాత్ర కీలకంగా మారింది. ఈ డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల రేట్లు తలకు మించిన భారంగా మారాయనే మాట ఎప్పటినుంచో వినిపిస్తోంది.. చివరకు దీనిపై తాడోపేడో తేల్చుకునే దిశగా మార్చి 1 నుంచి థియేటర్లు మూసేయడానికి నిర్ణయించారు. తాజాగా దీనిపై హైదరాబాద్ లో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జెమిని కిరణ్.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్ రావు.. ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు - శ్యామ్ ప్రసాద్ రెడ్డి - విశాల్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సమస్యపై కలిసికట్టుగా పోరాడాలని.. సమస్య తేలేవరకు సౌత్ మొత్తం థియేటర్లను మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు.
‘‘ఈ సమస్యపై ముందు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి మాట్లాడదామని అనుకుంటున్నాం. థియేటర్ ఓనర్ల డిమాండ్లకు వాళ్లు ఎంతవరకు అంగీకరిస్తారు అనేది చూడాలి. అటువైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే ముందు అనుకున్నట్టుగా మార్చి 1 నుంచి థియేటర్ల ను మూసేయడమే మంచిది’’ అంటూ ఈ మీటింగ్ హాజరైన సభ్యుడు ఒకరు తెలిపారు. చూస్తూ ఉంటే ఈ ఇష్యూ బాగా వేడెక్కినట్టే కనిపిస్తోంది.