తెలుగ‌మ్మాయి బాధ‌ప‌డుతోంది

Update: 2016-05-26 22:30 GMT
ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలంటారు. కానీ మన తెలుగు క‌థానాయిక‌లు మాత్రం ర‌చ్చ గెలిచాకే ఇంటివైపు చూస్తుంటారు. ఇంట కూడా గెల‌వాల‌ని, మ‌న ప్రేక్ష‌కుల మెప్పు  పొందాల‌ని, నార్త్ అమ్మాయిల‌కి మేం ఏమాత్రం తీసిపోమ‌ని నిరూపించాల‌నీ వీళ్ల‌కీ ఉంది కానీ, ప‌రిశ్ర‌మ‌లో అందుకు అనువైన ప‌రిస్థితులే క‌నిపించ‌డం లేదు. అందుకే పొరుగు భాష‌ల‌పై కాన్సంట్రేట్ చేస్తుంటారు. అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలైన స్వాతి - అంజ‌లి - బింధుమాధ‌వి త‌దిత‌ర భామ‌ల‌కి త‌మిళ్‌ - మ‌ల‌యాళం భాష‌ల్లోనే ఎక్కువ‌గా అవకాశాలు వ‌చ్చాయి. అది చూసి మ‌న‌వాళ్లూ అప్పుడ‌ప్పుడు అవ‌కాశాలిస్తుంటారు.

ఇప్పుడు శ్రీదివ్య‌ - హాసికలాంటి అమ్మాయిలు త‌మిళంలో రాణిస్తున్నారు. శ్రీదివ్య అయితే  ఇంచుమించు ఓ స్టార్ హీరోయిన్ రేంజిలో దూసుకెళుతోంది. ఎంత డ‌బ్బు సంపాదిస్తున్నా, పొరుగు భాష‌లో ఎంత గుర్తింపు వ‌స్తున్నా మ‌న‌దైన భాష‌లో అవ‌కాశాలు రావ‌డం లేదు క‌దా అని  శ్రీదివ్య బాధ‌ప‌డుతోంది. తెలుగమ్మాయి అయి వుండి కూడా తెలుగులో న‌టించ‌లేక‌పోవ‌డం ఎప్పుడూ  ఓ పెద్ద లోలుగానే ఉంటుంద‌ని ఆమె చెప్పుకొచ్చింది. శుక్ర‌వారం రాయుడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆమె గురువారం విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించింది. ``త‌మిళంలో మంచి అవ‌కాశాలొస్తున్నాయి, అక్క‌డ క‌థానాయిక‌ల పాత్ర‌ల్ని తీర్చిదిద్దే విధాన‌మే డిఫ‌రెంట్‌ గా ఉంటుంది, అందుకే అక్క‌డే న‌టిస్తున్నా. తెలుగులోనూ అలాంటి ఆఫ‌ర్లు వ‌స్తే ఎగిరి గంతేస్తా`` అని చెప్పుకొచ్చింది శ్రీదివ్య‌. ఇటీవ‌లే మ‌న ప‌రిశ్ర‌మ‌లోనూ మార్పు క‌నిపిస్తోందనీ, త్వ‌ర‌లో మాకూ అవ‌కాశాలొస్తాయ‌న్న న‌మ్మ‌కముంద‌ని ఆమె చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News