శ్రీ‌దేవి వీడియో 6 రోజుల పాత‌ది!

Update: 2018-02-25 23:12 GMT
శ్రీ‌దేవి మ‌ర‌ణించిన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన కాసేప‌టికి ఒక వీడియో వైర‌ల్ అయ్యింది. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి కొద్ది క్ష‌ణాల ముందు అంటూ వాట్సాప్ ల‌లో విప‌రీతంగా వైర‌ల్ అయిన వీడియోకు సంబంధించిన అస‌లు విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌ర‌ణించ‌టానికి కొద్ది క్ష‌ణాల ముందు శ్రీ‌దేవి నిండుగా అలంక‌రించుకొని.. అంద‌రిని ప‌లుక‌రిస్తూ.. హ్యాపీగా నృత్యం చేస్తున్న వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఆ వీడియో అంద‌రూ అనుకున్న‌ట్లు శ్రీ‌దేవి మ‌ర‌ణానికి కాసేప‌టి ముందు తీసింది కాదు. ఇవాల్టితో లెక్క వేసుకుంటే దాదాపు ఆరు రోజుల కింద‌టిది. అంటే.. శ్రీ‌దేవి పాల్గొన్న చివ‌రి వేడుక వీడియో క్లిప్ గా చెప్పాలి.

త‌మ కుటుంబానికి బాగా ద‌గ్గ‌రైన త‌న ఆడ‌ప‌డుచు కుమారుడు మోహిత్ మార్వా వివాహానికి హాజ‌ర‌య్యేందుకు శ్రీ‌దేవి క‌టుంబం నాలుగు రోజుల క్రితం ర‌స్ అల్ ఖైమాకు చేరుకుంది. ఫిబ్ర‌వ‌రి 20న పెళ్లి వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడ‌క‌కు దాదాపు 500 నుంచి 600 వ‌ర‌కు అతిధులు హాజ‌రైన‌ట్లు చెబుతున్నారు.

ఈ పెళ్లి వేడుక‌కు బోనీక‌పూర్ మొద‌టి భార్య కొడుకు అర్జున్ క‌పూర్.. కూతురు అన్హులాలు కూడా హాజ‌ర‌య్యారు. బోనీ.. శ్రీ‌దేవి.. వారి చిన్న కుమార్తె ఖుషీ హాజ‌రై పెళ్లిలో సంద‌డి చేశారు. పెళ్లి వేడుక పూర్తి అయ్యాక క‌పూర్ కుటుంబ స‌భ్యులు తిరిగి ఇండియాకు ప‌య‌న‌మ‌య్యారు. అయితే.. శ్రీ‌దేవి.. బోనీక‌పూర్ ఫ్యామిలీ మాత్రం అక్క‌డే ఉండిపోయింది.

పెళ్లి వేడుక జ‌రిగిన ర‌స్ అల్ ఖైమా నుంచి దుబాయ్‌కు చేరుకున్నారు. షాపింగ్ నిమిత్తం జుమేరియాలోని ఎమిరేట్స్ ట‌వ‌ర్స్ హోట‌ల్లో బోనీ ఫ్యామిలీ ఉండిపోయింది.

మ‌రోవైపు బోనీక‌పూర్ కు ముంబ‌యిలో త‌న స్నేహితుడి కుమార్తె బ‌ర్త్ డే వేడుక‌లు ఉండ‌టంతో ఫిబ్ర‌వ‌రి 22న బోనీక‌పూర్ ఇండియాకు బ‌య‌లుదేరి వ‌చ్చారు. శ‌నివారం నాడే ఆయ‌న దుబాయ్ వెళ్లారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో వ‌చ్చిన క‌థ‌నం ప్ర‌కారం.. హోట‌ల్ గ‌దిలో ఉన్న శ్రీ‌దేవి గ‌డిచిన రెండు రోజులుగా బ‌య‌ట‌కు రాలేద‌ని చెబుతున్నారు. దుబాయ్ కు బోనీక‌పూర్ చేరుకున్న త‌ర్వాత డిన్న‌ర్ కు వెళ్ల‌టానికి ముందు బాత్రూంకు వెళ్లిన శ్రీ‌దేవి తిరిగి రాలేద‌ని తెలుస్తోంది. ఇదంతా చూసిన‌ప్పుడు చ‌లాకీగా క‌నిపించి.. అంద‌రి మ‌దిలో ముద్రేసిన శ్రీ‌దేవి వీడియో పాత‌దిగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News