శ్రీను వైట్ల ఉక్కిరి బిక్కిరి

Update: 2015-09-19 07:07 GMT
పోయినేడాది ‘టెంపర్’ విషయంలో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ముందేమో సంక్రాంతికి విడుదల అని ఘనంగా ప్రకటించేశారు. కానీ అనుకోని అవాంతరాలతో షూటింగ్ లేటైపోయింది. డెడ్ లైన్ దగ్గర పడే సమయానికి చేతులెత్తేశారు. పూరి జగన్నాథ్ రేయింబవళ్లు పని చేసినా ఫలితం లేకపోయింది. చివరికి నెల ఆలస్యంగా రిలీజైంది టెంపర్. ఇప్పుడు ‘బ్రూస్ లీ’ విషయంలోనూ ఇలాంటి ఇబ్బందే ఎదురవుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు 16కే సినిమా విడుదల అని ప్రకటించేశారు కానీ.. ఇప్పుడంతా హడావుడి అయిపోతోంది. ప్రస్తుతానికి దాదాపుగా 90 శాతం సినిమా పూర్తయిపోయింది. ఇక మిగిలింది చిరు పోర్షనే.

ఐతే రిలీజ్ డేటుకి నాలుగు వారాలు కూడా టైం లేదు. చిరు పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలి. ఆడియో రెడీ అవ్వాలి. ఫంక్షన్ చేయాలి. ప్రమోషన్ చేయాలి. సినిమాను విడుదల చేయాలి. టైం చాలా తక్కువుండటంతో అన్ని పనులూ పూర్తి చేయడానికి శ్రీను వైట్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు సమాచారం. చిరు సుదీర్ఘ విరామం తర్వాత తెరమీద కనిపించబోతున్న సినిమా ఇది. ఆయన నటించే సన్నివేశాలైనా - పాటైనా  ఫైటైనా ఓ రేంజిలో ఉండాలని ఆశిస్తారు అభిమానులు. కాబట్టి మరీ హడావుడి పడితే కష్టం. కొంచెం ఆచితూచి షూటింగ్ చేయాలి. మరోవైపు తమన్ చేతిలో చాలా ప్రాజెక్టులుండటంతో ఆడియో - రీరికార్డింగ్ విషయంలో కొంచెం ఆలస్యమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో శ్రీను వైట్ల అండ్ టీమ్ చాలా టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. వ్యవహారం మరీ ఇబ్బందిగా మారితే రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
Tags:    

Similar News