మూవీ రివ్యూ: శ్రీరస్తు శుభమస్తు

Update: 2016-08-05 14:43 GMT
చిత్రం: ‘శ్రీరస్తు శుభమస్తు’

నటీనటులు: అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి - ప్రకాష్ రాజ్ - రావురమేష్ - సుమలత - తనికెళ్ల భరణి - హంసానందిని - రవిప్రకాష్ - ఆలీ - సుబ్బ‌రాజు - ప్ర‌భాస్ శీను తదితరులు
ఛాయాగ్రహణం: మణికందన్
సంగీతం: తమన్
నిర్మాత: అల్లు అరవింద్ - బన్నీ వాస్
రచన - దర్శకత్వం: పరశురామ్

'గౌరవం' నిరాశ పరిచి 'కొత్త జంట' తో హిట్ కొట్టినా అల్లు శిరీష్ కి అనుకున్నంతగా పేరు రాలేదు. మరోవైపు ‘సారొచ్చారు’ సినిమాతో దెబ్బ తిన్న పరశురామ్ కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. హీరో-దర్శకుడి ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా.. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ మాత్రం ఆసక్తి రేకెత్తించాయి. సినిమా మీద అంచనాలు పెంచాయి. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే ఉందా..? హిట్టు కోసం శిరీష్-పరశురామ్ జోడీ చేసిన ప్రయత్నం ఫలించేలా ఉందా..? చూద్దాం పదండి.

కథ:

శిరీష్ (అల్లు శిరీష్) బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన కుర్రాడు. అతను కాశ్మీర్ లో 66 (లావణ్య) అనే అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఐతే తన ప్రేమ సంగతి ఇంట్లో చెబితే అతడి తండ్రి (ప్రకాష్ రాజ్) ఒప్పుకోడు. మధ్యతరగతి మనుషులంటే శిరీష్ తండ్రికి చిన్నచూపు. వాళ్లు కేవలం డబ్బు కోసమే పెద్దింటి చెందిన వాళ్లను ప్రేమిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడతాడు. దీంతో తాను ఓ మామూలు అబ్బాయిలాగా అనుకు పరిచయమై ఆమె ప్రేమను గెలుస్తానని.. తనను అలా ప్రేమిస్తేనే తనను ఇంటికి తీసుకొస్తానని సవాల్ చేసి వెళ్తాడు శిరీష్. మరి శిరీష్ అనుకి ఎలా పరిచయమ్యాడు.. ఆమె ప్రేమను ఎలా గెలిచాడు.. చివరికి శిరీష్ తండ్రి వీళ్లిద్దరి ప్రేమకు అంగీకరించాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కొత్త క‌థ‌ల‌తో సాహ‌సం చేయ‌డం కంటే పాత క‌థ‌ల్నే కొంచెం తిర‌గ‌రాసి.. ఆస‌క్తిక‌ర‌మైన క‌థనాన్ని జోడిస్తే సునాయాసంగా బాక్సాఫీస్ గండాన్ని దాటేయొచ్చ‌ని చాలామంది ద‌ర్శ‌కులు రుజువు చేశారు. క‌చ్చితంగా హిట్టు కొట్టి తీరాల్సిన స్థితిలో ఉన్న ప‌ర‌శురామ్-శిరీష్ జోడీ కూడా ఆ బాట‌లోనే న‌డిచింది. ఆహ్లాద‌క‌రమైన హాస్యం.. చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్లు పండించ‌డంలో త‌న ప్ర‌తిభ‌ను సోలో సినిమాతో చాటుకున్న ప‌ర‌శురామ్.. మ‌రోసారి త‌న బ‌లాన్ని న‌మ్ముకున్నాడు. ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తు’ను చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా మ‌లిచాడు. క‌థ‌గా చెప్పుకోవ‌డానికి ఇందులో కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌దు. కానీ ఎక్క‌డా బ్రేకుల్లేకుండా ఆహ్లాదంగా సాగిపోయే క‌థ‌నం ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ పాయింట్‌.

ప్రేమ గొప్ప‌దా.. కుటుంబ విలువ‌లు గొప్ప‌వా అనే విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఐతే ప‌ర‌శురామ్ ఈ రెండు అంశాల‌కూ స‌మ ప్రాధాన్యం ఇస్తూ వాటిని బ్యాలెన్స్ చేసిన తీరు మెప్పిస్తుంది. అందుకే ఈ సినిమా యువ‌త‌నూ అక‌ట్టుకుంటుంది. అలాగే కుటుంబ ప్రేక్ష‌కుల్నీ మెప్పిస్తుంది.ఆరంభ చ‌క్క‌టి స‌న్నివేశం క‌థ‌ను ఓపెన్ చేసిన ప‌ర‌శురామ్ చివ‌ర్లో మ‌రో చ‌క్క‌టి ప‌తాక స‌న్నివేశంతో క‌థ‌ను ముగించాడు. ప‌ర‌శురామ్ కు చ‌క్క‌టి పేరు తెచ్చిన ‘సోలో’తో పాటు క్లాసిక్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ‘బొమ్మ‌రిల్లు’ను కూడా ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తు’ గుర్తుకు తెస్తుంది. చాలా స‌న్నివేశాల్లో ఈ రెండు సినిమాలు త‌ల‌పుల్లోకి వ‌స్తాయి. ప‌తాక స‌న్నివేశాలు ‘బొమ్మ‌రిల్లు’నే త‌ల‌పిస్తాయి. ఇంకా ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘నేను శైల‌జ’ ఛాయ‌లు కూడా కొంత క‌నిపిస్తాయి.

ఐతే పాత సినిమాల స్ఫూర్తి క‌నిపిస్తున్నా మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని ఎమోష‌నల్ గా క‌దిలించ‌డంలో ప‌ర‌శురాం స‌క్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప‌తాక స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఎమోష‌న‌ల్ సీన్స్ ను డీల్ చేయ‌డంలో.. ప్రేక్ష‌కుల్లో ఉద్వేగం తీసుకురావ‌డంలో ప‌ర‌శురామ్ ప్ర‌త్యేక‌త ఈ స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంది. ప్ర‌కాష్ రాజ్‌.. రావు ర‌మేష్ ల కాంబినేష‌న్లో శిరీష్ చేసిన స‌న్నివేశాలు క్లైమాక్స్ కు బ‌లంగా నిలిచాయి. ఇక్క‌డ ప‌ర‌శురామ్ క‌లం బ‌లం క‌నిపిస్తుంది. మంచి డైలాగులు ప‌డ‌టం.. న‌టీన‌టుల చ‌క్క‌టి అభిన‌యం కూడా తోడ‌వ‌డం.. ఈ స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కులు ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట‌వుతారు. ద్వితీయార్ధంలో శిరీష్‌-అలీ-సుబ్బ‌రాజు కాంబినేష‌న్లో వ‌చ్చే స‌న్నివేశశాలు బాగా న‌వ్విస్తాయి. ప్ర‌థ‌మార్ధంలో ప్ర‌భాస్ శీను ఓ మోస్త‌రుగా న‌వ్విస్తాడు.

ఐతే ప్రేమ‌క‌థ‌ను మాత్రం ప‌ర‌శురామ్ స‌రిగా డీల్ చేయ‌లేకపోయాడు. హీరోయిన్ మీద హీరోది ల‌వ్ అట్ ఫ‌స్ట్ సైట్ అనుకున్నా.. హీరోయిన్ కు హీరో మీద ప్రేమ పుట్ట‌డానికి స‌రైన కార‌ణాలు క‌నిపించ‌వు. ఆమె అత‌డి విష‌యంలో ఇంప్రెస్ అయిపోవ‌డానికి త‌గ్గ బ‌ల‌మైన స‌న్నివేశాలు ప‌డ‌లేదు. పైగా ల‌వ్ స్టోరీని ఎక్కువ‌గా కామెడీని పండించ‌డానికి ఉప‌యోగించుకున్నారు. హీరో హీరోయిన్ కు ద‌గ్గ‌ర కావ‌డానికి త‌న‌కు ఐడెంటిటీ పోయింద‌ని.. త‌న‌కు ఏదీ గుర్తులేద‌ని అనేసి ఆమె గ‌దిలో చేరిపోవ‌డం.. ఆమె చుట్టూ తిర‌గ‌డం.. అంతా ఇల్లాజిక‌ల్ గా అనిపిస్తుంది. కొన్ని స‌న్నివేశాలు విసిగిస్తాయి.  కామెడీ బాగానే ఉన్నా.. లాజిక్ తో ఆలోచిస్తే ఈ స‌న్నివేశాల్ని ఎంజాయ్ చేయ‌లేం. క‌థాక‌థ‌నాలు ప్రేక్ష‌కుడి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు సాగ‌డం కూడా సినిమాలో చెప్పుకోద‌గ్గ మైన‌స్‌. ఓవ‌రాల్ గా చూస్తే కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్న‌ప్ప‌టికీ.. వాటిని మ‌రిపించే ప్ల‌స్సులు ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తు’లో చాలానే ఉన్నాయి. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌.

నటీనటులు:

అల్లు శిరీష్ చాలా మెరుగయ్యాడు. కాన్ఫిడెంట్ గా నటించాడు. ఏదో నటించాలి అన్నట్లు కాకుండా క్యాజువల్ గా ఉండటానికి ప్రయత్నించిన చోటల్లా శిరీష్ మెప్పించాడు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ శిరీష్ బాగా న‌టించాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో మాత్రం బ్లాంక్ ఫేస్ పెట్టాడు. అతడి బాడీ లాంగ్వేజే కొంచెం మారాల్సి ఉంది.  లావ‌ణ్య త్రిపాఠి అందంతో అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయి పాత్ర‌లో ఆమె చ‌క్క‌గా ఒదిగిపోయింది. ప్ర‌కాష్ రాజ్.. రావు ర‌మేష్ త‌మ అనుభ‌వాన్ని రంగ‌రించి స‌న్నివేశాల్ని ర‌క్తి క‌ట్టించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వీరి ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. త‌నికెళ్ల భ‌ర‌ణి.. ర‌ణ‌ధీర్‌.. ర‌విప్ర‌కాష్ పాత్ర‌లకు త‌గ్గ‌ట్లుగా న‌టించారు. అలీ.. ప్ర‌భాస్ శీను.. సుబ్బ‌రాజు న‌వ్వించే బాధ్య‌త‌ను బాగానే నిర్వ‌ర్తించారు.

సాంకేతిక వర్గం:

ఎప్పుడూ మాస్ సినిమాలకు రొటీన్ గా వాయించేసే తమన్ ‘శ్రీరస్తు శుభమస్తు’కు మాత్రం భిన్నమైన పనితనం చూపించాడు. తాను ఫీల్ గుడ్ మ్యూజిక్ కూడా ఇవ్వగలనని చాటుకున్నాడు. పాటలు ఉన్నవి తక్కువే కానీ.. అవి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మణికందన్ ఛాయాగ్రహణం కూడా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ ప్రమాణాలకు తగ్గట్లే నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ ఖర్చుతోనే రిచ్ గా సినిమాను తెరకెక్కించారు. పరశురామ్ రచయితగా.. దర్శకుడిగా రెండు రకాలుగానూ మెప్పించాడు. డైలాగులు షార్ప్ గా.. సహజంగా.. అర్థవంతంగా ఉన్నాయి. ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌లేని నిస్స‌హ‌య‌త స్థితిలో ఉన్నాను కానీ..ప్రేమ లేక కాదు.. లాంటి డైలాగుల్లో ప‌ర‌శురామ్ ముద్ర క‌నిపిస్తుంది. పాత కథనే ఆసక్తికరమైన కథనంతో చెప్పాడు పరశురామ్. వినోదం పండించడానికి కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ కామెడీ బాగానే పండించాడు. ఐతే దర్శకుడిగా అతడి బలం ఎమోషనల్ సీన్స్ లోనే తెలుస్తుంది. దర్శకుడిగా పరశురామ్ మళ్లీ ట్రాక్ లో పడ్డట్లే.

చివ‌ర‌గాః శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.. రొటీన్ గానే న‌వ్విస్తుంది.. క‌దిలిస్తుంది

రేటింగ్: 3/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News