డైరెక్టర్లకు ఏడాది గ్యాప్ కామన్ అయ్యిందే!

Update: 2019-04-23 17:30 GMT
సినిమా ఇండస్ట్రీలో విజయాల శాతం జస్ట్ 12 నుంచి 14 వరకు ఉంటుంది.  ఇదేమీ ఊరికే ఉబుసుపోక చెప్పే మాట కాదు. కొన్నేళ్లుగా ట్రేడ్ ను దగ్గరగా పరిశీలించేవారు చెప్పే మాట. అసలే విజయాలు సాధించడం కష్టమైన ఈ పరిశ్రమలో దర్శకుల పరిస్థితి ఎప్పుడూ కత్తిమీద సామే. 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ కు చెందినా వారికైనా ఫ్లాప్స్ ఉంటే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందేమో కానీ డైరెక్టర్లకు మాత్రం చాలా కష్టం. ఒక్కసారి కనుక డిజాస్టర్ తగిలితే అందులోనుంచి కోలుకోవడం ఎంతో కష్టం. కానీ ఈమధ్య సూపర్ హిట్స్.. బ్లాక్ బస్టర్లు సాధించిన దర్శకులు కూడా నెక్స్ట్ సినిమా కోసం ఏడాదికి పైగా వెయిట్ చేయాల్సి రావడం మాత్రం ఒకవిధంగా ఇబ్బందికరమైన పరిణామమే.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందే. ఆయన లాస్ట్ సినిమా 'భరత్ అనే నేను'.  పోయినేడాది సమ్మర్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆ స్టార్ హీరోతో అని ఈ స్టార్ హీరోతో అని గుసగుసలు వినిపించినా ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తారని వెల్లడించారు.  కానీ మెగాస్టార్ 'సైరా' షూటింగ్ డిలే కావడంతో ఆ ఇంపాక్ట్ కొరటాల శివ సినిమాపై పడింది. 'భరత్ అనే నేను' తర్వాత ఇప్పటికి దాదాపుగా ఏడాది అవుతోంది. చిరు సినిమా పట్టాలెక్కేందుకు మినిమం ఇంకా రెండు మూడు నెలలు పట్టేలా ఉంది.  ఒకవేళ ఈ ఏడాది వెయిటింగ్ కనుక లేకపోతే కొరటాల దర్శకత్వంలో ఈ గ్యాప్ లో మరో సినిమా వచ్చి ఉండేదనడంలో ఏమీ ఆశ్చర్యం లేదు.

మరో అగ్రదర్శకుడు సుకుమార్ పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.  నిజం చెప్పుకుంటే కొరటాల కంటే పరిస్థితి ఇంకా నిరాశాజనకంగా ఉంది.  రామ్ చరణ్ తో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సుకుమార్ కు కూడా వన్ ఇయర్ గ్యాప్ వచ్చేసింది.  మహేష్ బాబు-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో సినిమా సైడ్ అయిపోయింది.  అల్లు అర్జున్ తో సినిమా లైన్లో ఉన్నప్పటికీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సమయం పడుతుంది.  'రంగస్థలం' లాంటి చిత్ర దర్శకుడు తన నెక్స్ట్ సినిమాకు ఏడాది పైగా వెయిట్ చేయాల్సి రావడం నిరాశ కలిగించేదే.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే వంశీ పైడిపల్లి కూడా 'ఊపిరి' తర్వాత ఏడాదికి పైగా మహేష్ సినిమాకోసం వేచి చూడాల్సి వచ్చింది. నిజానికి 'స్పైడర్' చివరిదశ షూటింగ్ లో ఉన్నప్పుడే 'మహర్షి' ఒకే అయింది. కానీ 'స్పైడర్' డిలే కావడం.. ఆ తర్వాత 'భరత్ అనే నేను' ఏడాది షూటింగ్ జరుపుకోవడం..ఇలా 'మహర్షి' పట్టాలెక్కేవరకూ వంశీ దాదాపు ఒకటిన్నర సంవత్సరంపాటూ వేచి చూడాల్సి వచ్చింది.

'గీత గోవిందం' తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు దర్శకుడు పరశురామ్.  పోయినేడాది ఆగష్టులో రిలీజ్ అయింది. ఇప్పటివరకూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదు.  ఒకవేళ ఇప్పుడు ప్రాజెక్ట్ లాక్ అయినా సెట్స్ పైకి వెళ్లేందుకు కనీసం మూడు నాలుగు నెలలకు పడుతుంది.  ఒకవేళ టాప్ లీగ్ స్టార్ సినిమా అయితే ఆ టైం ఇంకా పెరిగే అవకాశం ఉంది.

స్టార్ డైరెక్టర్ల పరిస్థితే ఇలా ఉంటే ఎంట్రీ లెవెల్.. మీడియం రేంజ్ డైరెక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.  డైరెక్టర్ సుజత్ ప్రభాస్ 'సాహో' కోసం దాదాపు మూడేళ్ళు వెయిట్ చేశాడు.  ఇక 'జిల్' ఫేం రాధా కృష్ణ కుమార్ కూడా ప్రభాస్ తో సినిమా కోసం దాదాపు రెండేళ్ళు వెయిట్ చేశాడు.  ఇదంతా చూస్తుంటే ఒక విషయం మాత్రం మనకు అర్థం అవుతుంది.  ఒక దర్శకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే భూదేవికున్నంత ఓర్పు.. సహనం.   అది లేకపోతే స్టార్ హీరోల ప్రాజెక్టులు అసలు సెట్ అయ్యే ఛాన్సే లేదు
    

Tags:    

Similar News