60వేల మంది సినీ కార్మికుల‌కు.. స్టార్ హీరో, నిర్మాత‌ల‌ సాయం!

Update: 2021-05-07 14:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్‌ దారుణంగా ప్ర‌భావం చూపిన రంగాల్లో మొద‌టి స్థానం సినిమా ఇండ‌స్ట్రీదే అని చెప్ప‌డంలో సందేహం లేదు. అన్ని రంగాలూ అర‌కొర‌గానైనా కొన‌సాగుతుండ‌గా.. సినీ ప‌రిశ్ర‌మ మాత్రం ఎప్పుడో మూతప‌డింది. థియేట‌ర్లు మూత‌ప‌బ‌డ్డాయి. షూటింగులూ నిలిచిపోయాయి. దీంతో.. వాటిపై ఆధార‌ప‌డిన వేలాది మంది కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులు కార్మికుల‌కు అండ‌గా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌.. 25,000 మంది సినీ కార్మికుల‌కు ఆర్థిక స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఈ విష‌యాన్ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియ‌న్ సినీ ఎంప్లాయీస్ అధ్య‌క్షుడు బీఎన్ తివారీ వెల్ల‌డించారు.

స‌ల్మాన్ తోపాటు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ కూడా 35,000 మంది సీనియ‌ర్ సిటిజ‌న్ కార్మికుల‌కు స‌హాయం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అటు స‌ల్మాన్ కు, ఇటు య‌శ్ రాజ్ ఫిల్మ్స్ కు కార్మికుల జాబితాను అంద‌జేశామ‌ని, త్వ‌ర‌లోనే వారు స‌హాయం అందించ‌బోతున్నార‌ని చెప్పారు.

న‌లుగురు స‌భ్యులు ఉన్న కుటుంబాల‌కు నెల‌వారీ రేష‌న్ స‌రుకులు ఇచ్చేందుకు కూడా య‌శ్ రాజ్ ఫిల్మ్స్ ముందుకొచ్చింద‌ని తివారీ తెలిపారు. ఇటీవ‌లే స‌ల్మాన్ ఖాన్ 5000 మంది ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు ఆహార ప్యాకెట్ల‌ను అంద‌జేశారు.
Tags:    

Similar News