సందేశాలు సినిమాల వరకేనా?

Update: 2019-05-06 10:16 GMT
సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో ధియేటర్లలో వసూళ్ళ మోత మ్రోగించెందుకు మహర్షి రెడీ అవుతున్నాడు. అభిమానుల ఉత్శుకత గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే కీలక కేంద్రాల్లో అడ్వాన్సు బుకింగ్ మొదలుపెట్టేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని స్క్రీన్లలో అనుమతులు తెచ్చుకుని మరీ టికెట్ల ధరలు పెంచి అమ్మడం మీద సింగల్ స్క్రీన్ ఓనర్లతో పాటు ప్రేక్షకుల నుంచి సైతం నిరసన వ్యక్తమవుతోంది. సినిమా బడ్జెట్ తో పాటు బిజినెస్ వంద కోట్లు దాటింది కాబట్టి ఆ మేరకు రాబట్టుకోవడానికి పెంపు తప్ప మరో మార్గం లేదని నిర్మాతలు ప్లస్ బయ్యర్ల నుంచి వినిపిస్తున్న మాట.

ఇది మహర్షి మొదలు పెట్టలేదు. నిజమే. చరిత్ర సృష్టించిన బాహుబలితో మొదలుకుని మొదటి రోజే చాప చుట్టేసిన అజ్ఞాతవాసి దాకా అన్నింటి విషయంలోనూ ఇదే జరిగింది. మొదటి వారం పది రోజులు అడ్డగోలుగా రేట్లు పెంచేసి తొలిరోజుల్లో సినిమా చూడాలంటె అదనపు భారం భరించాల్సిందే అనేలా వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఆహ్వానించదగినది కాదు

వాస్తవానికి మహర్షిలో విజువల్ గ్రాఫిక్స్ ఏమి లేవు. ఇదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా. అంతే. కాకపోతే ఏదో రైతుల వ్యధల మీద సందేశాన్ని ఇచ్చారు. అది మినహాయిస్తే మసాలా సినిమాల తరహాలో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. అమెరికాలో తీసిన సుదీర్ఘమైన షెడ్యూల్ ఇక్కడ వేసిన సెట్స్ తప్ప మరీ కనివిని ఎరుగని బడ్జెట్ దీనికేమి ఖర్చు పెట్టలేదు. కేవలం రెమ్యునరేషన్లకే మొత్తం సమర్పణం అయ్యింది.

విదేశాల్లో తీసినందుకే రికవరీ కోసం టికెట్ రేట్లు పెంచి అమ్మే పనైతే అన్నింటికీ అదే చేయాల్సి వస్తుంది. దీనికి అడ్డుకట్టు ఎప్పుడు పడుతుంది అనేదే భేతాళ ప్రశ్న. సినిమాలలో బోలెడు సందేశాలు ఇస్తూ వాటిని చూసేందుకు వచ్చే ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టె విధానాన్ని ఏమంటారో నిర్మాతలే సెలవివ్వాలి.

ఎంతసేపు బడ్జెట్ పెరిగింది అని చెప్పడమే తప్ప తగ్గించుకునే మార్గాలు వెతికి వినోదాన్ని సరైన ధరకే అందించే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అనేదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం దొరకదు కాని ప్రతి స్టార్ హీరో కమర్షియల్ సినిమాకు ఇలా టికెట్ల ధరలను ఆకాశాన్ని దాటిస్తూ సామాన్య ప్రేక్షకుడికి వినోదాన్ని దూరం చేసే పద్ధతికి అడ్డుకట్ట పడనంత వరకు పైరసీ లాంటి భూతాలు చెలరేగిపోతూనే ఉంటాయి
Tags:    

Similar News