టాప్ స్టోరి: స్టార్ల హెల్త్ సీక్రెట్స్

Update: 2019-09-04 01:30 GMT
మ‌నిషి అన్నాక అనారోగ్యం రాకుండా ఉంటుందా?  సృష్టిలోని స‌మ‌స్త ప్రాణికోటికి రుగ్మ‌త‌లు త‌ప్ప‌వు. ఏదో ఒక‌రోజు డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మందు బిళ్ల మింగి ఇంజ‌క్ష‌న్లు చేయించుకోవాల్సిందే. అలా కాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో జీవించ‌గ‌లిగితే అది దేవుడిచ్చిన వ‌రం అనే అనుకోవాలి. లెజెండ్స్ ఏఎన్నార్- ఎన్టీఆర్- ఎస్వీఆర్- శోభ‌న్ బాబు- ముర‌ళీమోహ‌న్ లాంటి వాళ్లు ఎంతో ఆరోగ్యంగా లైఫ్ టైమ్ ని నెట్టుకొచ్చారు కానీ.. ఈరోజుల్లో స్టార్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండ‌గ‌ల‌గ‌డం అంటే అంత ఆషామాషీ ఏం కాదు. నాటితో పోలిస్తే కాలుష్యం ఎక్కువే. ప‌ని ఒత్తిళ్లు డ‌బ్బాశ కూడా ఎక్కువే. దీంతో పాటే వ‌చ్చే రోగాల‌కు కొద‌వేం లేదు. అయితే అదృష్ఠ‌వ‌శాత్తూ టాలీవుడ్  స్టార్ల‌కు అలా తీవ్రంగా ఇబ్బంది పెట్టేసే.. ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌నే చెప్పాలి. ఇప్పుడున్న డ‌జ‌ను మంది టాలీవుడ్ అగ్ర హీరోలు నిరంత‌రం హెల్తీ లైఫ్ ని లీడ్ చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా  బిజీ షెడ్యూల్స్ తో లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. నిరంత‌రం షూటింగుల హ‌డావుడి ఉన్నా ప్ర‌తిదీ బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్ ని ఉత్త‌మంగా తీర్చిదిద్దుకోవ‌డం ద్వారా చాలా వాటిని అధిగ‌మించార‌నే చెప్పొచ్చు. అప్పుడ‌ప్పుడు ఆన్ లొకేష‌న్ యాక్సిడెంట్లు- గాయాలు మిన‌హా సీరియ‌స్ ఇల్ హెల్త్ అన్న టాక్ అయితే లేదు.

అదంతా స‌రే అనుకుంటే.. కొంద‌రు స్టార్లకు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా.. మ‌రీ అంత బ‌య‌ట‌ప‌డేంత స‌మ‌స్య‌లేవీ కావ‌న్న‌ది ఇన్ సైడ్ టాక్. టాలీవుడ్  సీనియ‌ర్ హీరోలు .. ప‌వ‌న్ క‌ల్యాణ్ - నాగార్జున వంటి స్టార్ల‌కు వెన్ను నొప్పి(బ్యాక్ పెయిన్) స‌మ‌స్య‌లు అంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. అయినా పెర్ ఫెక్ట్ ట్రీట్ మెంట్ ఆరోగ్య‌క‌ర‌మైన హ్యాబిట్స్ తో వీళ్లు ఆ స‌మ‌స్య‌ల్ని అధిగ‌మించి షూటింగుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలాన్ని ర‌న్ చేశార‌ని చెబుతారు. ఇక‌పోతే ఇటీవ‌లే కింగ్ నాగార్జున‌కు అనారోగ్యంగా ఉంద‌ని వాట్సాప్ గ్రూప్ లు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. మ‌న్మ‌ధుడు 2 లో యంగ్ లుక్ కోసం ఆయ‌న జిమ్ముల్లో తీవ్రంగా శ్ర‌మించార‌ని దానివ‌ల్ల స‌మ‌స్య‌లొచ్చాయ‌ని ప్ర‌చారం చేశారు. అయితే వైర‌ల్ ఫీవ‌ర్ వ‌ల్ల బాధ‌ప‌డ్డాన‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారు. స్పెయిన్ ఇబిజ‌లో 60వ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చాయి. ఇకపోతే యంగ్ హీరో ద‌గ్గుబాటి రానాకు ఇటీవ‌లే అమెరికాలో శ‌స్త్ర చికిత్స జరిగింది. సీక్రెట్ గా ఉంచాల‌నుకున్నా అది కాస్తా అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది.  అలాగే టాలీవుడ్ యువ‌క‌థానాయిక సుహాసిని (చంటిగాడు ఫేం) అప్ప‌ట్లో క్యాన్స‌ర్ కు చికిత్స పొందారు. ప్ర‌స్తుతం బుల్లితెర వెండితెర‌కు న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఇంత‌కుముందు సీనియ‌ర్ క‌మెడియ‌న్లు ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం-ఏవీఎస్-ఎమ్మెస్ నారాయ‌ణ వంటి వారు వ‌యోభారంతో వ‌చ్చిన ఆరోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డ్డారు. సద‌రు ప్ర‌ముఖులు కాలం చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఇక‌పోతే ఇత‌ర‌త్రా ప‌రిశ్ర‌మ‌ల్ని ప‌రిశీలిస్తే.. సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ అరుదైన ఆరోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ర‌జ‌నీకి అలెర్జిక్ బ్రాంకైటిస్ ఉంది. దాంతో పాటే వైర‌ల్ ఫీవ‌ర్ రావ‌డంతో 2011లో సింగ‌పూర్ లో చికిత్స పొందారు. ఇక 2.0 సెట్స్ పై ఉన్న‌ప్పుడు.. కబాలి రిలీజ్ స‌మ‌యంలో మ‌రోసారి ర‌జ‌నీ అస్వ‌స్థ‌త వార్త‌లు అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికా లాంటి చోట్ల చికిత్స పొందిన ర‌జ‌నీ ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. 68 వ‌య‌సులోనూ ఆయ‌న ఎంతో యాక్టివ్ గా వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ అంద‌రిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 90ఏళ్ల పాటు ఎంతో ఆరోగ్యంగా జీవించి తుది శ్వాస వ‌ర‌కూ సినిమాల్లో న‌టించిన గొప్ప లెజెండరీ న‌టుడిగా ఏఎన్నార్ ఎంద‌రికో స్ఫూర్తి నింపారు. ఆ త‌ర్వాత ర‌జ‌నీ త‌న లైఫ్ మొత్తం సినిమాల‌కే అంకిత‌మ‌వ్వ‌డం.. ప్ర‌స్తుతం రాజ‌కీయారంగేట్రానికి సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక క‌మ‌ల్ హాస‌న్ టైప్ 1 డ‌యాబెటిస్ కి చికిత్స పొందుతున్నారు.

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ నాలుగు ద‌శాబ్ధాల పాటు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూనే ఆయ‌న కెరీర్ ని విజ‌య‌ప‌థంలో న‌డిపించ‌డం సెన్సేష‌న్ అనే చెప్పాలి. 1982లో కూలీ అనే సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు యాక్ష‌న్ సీన్ లో గాయ‌ప‌డితే చాలా ర‌క్తం పోయింది. 1984లో అత‌డికి మైస్థానియా గ్రావిస్ అనే అరుదైన రుగ్మ‌త ఉంద‌ని డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. ఆ త‌ర్వాత మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయారు. ఇప్ప‌టికీ ఆయ‌న హెప‌టైటిస్ బి- లివ‌ర్ సిర్రోసిస్ వంటి ప్ర‌మాద‌కర రుగ్మ‌త‌ల బాధితుడిన‌ని బ‌హిరంగంగా చెప్పడం షాకిస్తుంది. బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ కి అరుదైన ఆరోగ్య‌ స‌మ‌స్య ఉంది. 2011 నుంచి స‌ల్మాన్ కి ట్రైజెమిన‌ల్ న్యూరాల్జియా అనే అరుదైన రోగంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖం స‌హా కొన్నిచోట్ల అత‌డికి పెయిన్ వ‌స్తుంటుంది. అయినా ఈ నొప్పుల‌తోనే అత‌డు నిరంత‌రం జిమ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు. కింగ్ ఖాన్ షారూక్ కి ఇప్ప‌టికే ఎనిమిది స‌ర్జ‌రీలు చేశారు. మోకాళ్లు- క‌న్ను- మెడ‌- యాంకిల్- రిబ్స్.. ఇవ‌న్నీ శ‌స్త్ర చికిత్స‌లు చేసి సెట్ చేసిన‌వే. ఆ నొప్పులతోనే అనారోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్న బాద్ షా ఇప్ప‌టికీ ఏటికి ఎదురెళ్లే ధీరుడ‌ని చెబుతారు. హృతిక్ రోష‌న్ కి బ్రెయిన్ లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టింది. దానికి శ‌స్త్ర చికిత్స చేసిన సంగ‌తి తెలిసిందే.  సైఫ్ అలీఖాన్ కి గుండె నొప్పి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ బ‌సుకి బ్ల‌డ్ క్యాన్స‌ర్ కి చికిత్స పొందారు. న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్స‌ర్ అనే ప్ర‌మాద‌క‌ర రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్నారు.

ఇక క‌థానాయిక‌ల విష‌యానికి వ‌స్తే.. అందాల న‌య‌నతార‌కు ఓ మిస్టీరియ‌స్ స్కిన్ ప్రాబ్లెమ్ ని డాక్ట‌ర్లు క‌నుగొన్నారు. మేక‌ప్ ర‌సాయ‌నాల వ‌ల్ల త‌లెత్తిన స‌మ‌స్య ఇది. దానికి చికిత్స కొన‌సాగుతోంది. స్టార్ హీరోయిన్ స‌మంత‌కు PLE లేదా పాలిమార్ఫ‌స్ లైట్ ఎర‌ప్ష‌న్ అనే అరుదైన స్కిన్ స‌మ‌స్య ఉంది. సూర్య కాంతి ప్ర‌భావాన్ని తట్టుకోలేదు. దానికి సామ్ గ‌తంలో చికిత్స పొందారు. ఇలియానాకు `బాడీ డిస్ మార్ఫిక్ డిజార్డ‌ర్` అనే అరుదైన రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతోంది. యాంగ్జైటీ- డిప్రెష‌న్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే రెగ్యుల‌ర్ గా జిమ్ త‌ప్పనిస‌రి. మ‌నీషా కొయిరాలా- లీసారే- సోనాలి బింద్రే వంటి అగ్ర క‌థానాయిక‌లు క్యాన్స‌ర్ కి గుర‌వ్వ‌డం దాంతో పోరాడి లైఫ్ ని పొడిగించ‌డం అన్న‌ది ఎంద‌రికో స్ఫూర్తినిచ్చింది. లీసారే మ‌ల్టిపుల్ మైలోమా అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డి పోరాటం సాగించారు. మ‌నీషా కొయిరాలా ఒవేరియ‌న్ క్యాన్స‌ర్ తో ఇబ్బంది ప‌డ్డారు. న‌టి ముంతాజ్ బ్రెస్ట్ క్యాన్స‌ర్ కి చికిత్స పొందారు. స్నేహా ఉల్లాల్ కి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇలా చ‌రిత్ర తిర‌గేస్తే అనారోగ్యంతో పోరాడి కెరీర్ ని సాగించిన స్టార్లు ఎంద‌రో ఉన్నారు.




Tags:    

Similar News