ముంబైలో ఇల్లు వెదుకుతున్న మ‌హేష్ బావ‌

Update: 2016-05-17 07:30 GMT
బాఘీ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు మ‌హేష్ బావ సుధీర్‌ బాబు. విల‌న్‌ గానే న‌టించిన‌ప్ప‌టికీ ఆయ‌న రోల్‌ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సుధీర్ చాలా బాగా న‌టించాడ‌ని హిందీ క్రిటిక్స్ కూడా ప్ర‌శంసించారు. దాంతో ఒక్క‌సారిగా  హిందీ ప‌రిశ్ర‌మ దృష్టిని ప్ర‌ముఖంగా ఆక‌ర్షించాడాయ‌న‌.  అప్ప‌ట్నుంచి హిందీ కెరీర్‌పై మ‌రింత దృష్టి పెట్ట‌మ‌ని సుధీర్‌ కి ఆయ‌న స‌న్నిహితులు స‌ల‌హా ఇస్తున్నార‌ట‌.  సుధీర్ కూడా ఆ విష‌యంపైనే కాన్సంట్రేట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

హిందీలో అవ‌కాశాలు వెల్లువెత్తాలంటే వాళ్ల‌కి మొద‌ట లోక‌ల్‌ గానే వుంటాడ‌న్న  ఫీలింగ్ క‌లించాలి. అందుకే సుధీర్ కూడా త‌న మ‌కాంని కొన్నాళ్ల‌పాటు ముంబైకి మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అక్క‌డ ఇంటిని వెదుక్కునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ట‌. ఆ విషయాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా చెప్పుకొచ్చారు సుధీర్‌. అలాగ‌ని నేను కంప్లీట్‌ గా ముంబైకి షిఫ్ట్ అవుతున్న‌ట్టు కాదు కానీ, అటు తెలుగు, ఇటు హిందీ రెండు భాష‌ల్లో న‌టిస్తూ వుంటాన‌ని సుధీర్ చెప్పుకొచ్చాడు. 

ప్ర‌స్తుతం ఆయ‌న‌కి క్రేజీ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయ‌ట‌. అక్ష‌య్‌ కుమార్‌ - హృతిక్‌ రోష‌న్‌ లాంటి న‌టుల‌తో క‌లిసి తెర‌ను పంచుకోవాల‌నుందని చెబుతున్నాడు.  బాఘీలో త‌న విల‌నీకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌నీ,  త‌న భార్య మొద‌లుకొని అంద‌రూ మెచ్చుకున్నార‌న్న సుధీర్ త‌న పిల్ల‌ల‌కి మాత్రం తాను విల‌న్‌గా క‌నిపించ‌డం ఇష్టం లేద‌ని చెప్పాడు. నేను తెర‌పై దెబ్బ‌లు తిన‌డం వాళ్ల‌కి న‌చ్చ‌ద‌ని, అందుకే వాళ్ల‌కి బాఘీ న‌చ్చ‌లేద‌ని సుధీర్ స్ప‌ష్టం చేశాడు. మహేష్‌ ని కూడా హిందీలో న‌టించ‌మ‌ని చెప్పొచ్చు క‌దా అని విలేక‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌కు సుధీర్ స‌మాధాన‌మిస్తూ త‌ను హిందీవైపు ఎందుకు ఆస‌క్తి చూప‌డం లేదో నాకూ అర్థం కాదనీ, కానీ  త‌న సినిమాలు హిందీలో డ‌బ్ అవుతూ చాలా బాగా ఆడుతుంటాయ‌ని చెప్పుకొచ్చాడు సుధీర్‌.
Tags:    

Similar News