సుధీర్-శర్వా.. ఎట్టకేలకు

Update: 2018-03-17 11:36 GMT
‘స్వామి రారా’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు సుధీర్ వర్మ. ఈ చిత్రంతో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ తర్వాత అతను స్థాయికి తగ్గ సినిమాలు అందించలేకపోయాడు. ‘దోచేయ్’ తీవ్ర నిరాశను మిగిలిస్తే.. ‘కేశవ’ బాగా ఆసక్తి రేకెత్తించినా అంచనాల్ని అందుకోలేకపోయింది. అయితే ఆ చిత్రం పెట్టుబడి అయితే వెనక్కి తేగలిగింది. దీని తర్వాత సుధీర్ వెంటనే శర్వానంద్ హీరోగా సినిమా కమిటయ్యాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. కానీ అన్నీ కుదిరినా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడంలో బాగా జాప్యం జరిగింది. ఇందుకు కారణాలు అనేకం.

‘మహానుభావుడు’ తర్వాత ఈ చిత్రమే చేయాల్సిన శర్వా.. ఇది ఆలస్యమవుతుండటంతో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ సినిమా మొదలుపెట్టాడు. దాదాపు సగం పూర్తి చేశాడు. మరి దీని తర్వాతైనా సుధీర్ సినిమా మొదలవుతుందా లేదా అని సందేహిస్తుండగా.. ఎట్టకేలకు ఈ చిత్రానికి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం కోసం కోటి రూపాయల ఖర్చుతో భారీ సెట్ నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. ఇంకొన్ని రోజుల్లోనే షూటింగ్ మొదలవుతుందట. శర్వానంద్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోయే ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా సాగుతుందట. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరన్న సంగతి ఇంకా తేలలేదు.


Tags:    

Similar News