జగడం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందా..?

Update: 2020-04-04 10:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ ఎవరంటే గుర్తొచ్చే పేర్లలో దర్శకుడు సుకుమార్ ఒకరు. ఈ లెక్కల మాస్టారు తన లెక్కలతో సినిమాల బాక్సాఫీస్ లెక్కలు మార్చేస్తుంటాడు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలను తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఆర్య' సినిమాతో దర్శకుడిగా మారిన సుక్కు తక్కువకాలంలోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆర్య 2 - 100% లవ్ - వన్ నేనొక్కడినే - రంగస్థలం చిత్రాల ద్వారా తన స్టామినా ఏంటో చూపించాడు. ముఖ్యంగా రంగస్థలం సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సుకుమార్ నుండి మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఒక మాస్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుద్దని సమాచారం.

అయితే సుకుమార్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సుకుమార్ కెరీర్ లో తన రెండో సినిమాగా తెరకెక్కిన చిత్రం 'జగడం'. ఈ సినిమా విజయం సాధించకపోయినప్పటికీ దర్శకుడిగా సుకుమార్ - హీరోగా రామ్ కి మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం రాబోతోందని సమాచారం. అల్లు అర్జున్ సినిమా పూర్తయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సుక్కు రామ్ కి స్టోరీ చెప్పాడని - రామ్ కి అది నచ్చిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారికం గా ఎలాంటి న్యూస్ బయటకి రానప్పటికీ ఇది నిజమయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సుక్కు బన్నీ సినిమా చేసే పనిలో ఉండటం తో ఇది పూర్తయ్యాక - వచ్చే ఏడాది రామ్ సినిమా గురించి ఆలోచించే అవకాశాలున్నాయట.
Tags:    

Similar News