‘రంగస్థలం’ రాయలసీమ నుంచి కోనసీమకు..

Update: 2018-04-27 05:55 GMT
‘రంగస్థలం’ సినిమా కోనసీమ నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా అన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రానికి ముందు ఆ ప్రాంత నేపథ్యం అనుకోలేదట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే ఎలా ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఆలోచించాడట. కానీ అక్కడ చేస్తే కథ ఔచిత్యం దెబ్బ తింటుందన్న ఆలోచనతో వెనక్కి తగ్గాడట. రాయలసీమలో పగా ప్రతీకారాలు.. నేరుగా ఉంటాయని.. ఐతే ఇందులో విలన్ పైకి మంచి వాడిలా కనిపిస్తూ లోపల మాత్రం అకృత్యాలు చేస్తుంటాడని.. రాయలసీమలో అలా ఉండదన్న ఉద్దేశంతోనే తర్వాత కోనసీమకు నేపథ్యాన్ని మార్చినట్లు సుకుమార్ వెల్లడించాడు. ఇక ఈ చిత్రానికి సరైన లొకేషన్ల కోసం చాలా చోట్ల తిరిగినట్లు సుకుమార్ చెప్పాడు.

కోనసీమ నేపథ్యం అనుకున్నాక మరీ పచ్చదనం చూపించినా ఇబ్బందే అని.. అలా చూపిస్తే ఊరి జనాలు కష్టాల్లో ఉన్న విషయం ఎస్టాబ్లిష్ కాదని.. అందుకే ఆ ప్రాంతంలో కొంచెం డ్రైగా ఉండే ప్రదేశాల కోసం చూశామని సుకుమార్ తెలిపాడు. ముందు శ్రీకాకుళంలో చూద్దామని వెళ్తే.. అక్కడంతా పచ్చగా ఉందని.. తర్వాత కోనసీమ ప్రాంతంలో ఒక చోట తమకు అనువైన ప్రదేశాలు కనిపించాయని సుకుమార్ వెల్లడించాడు. ముందు ఊరి వాళ్లందరూ వరి పంట సాగుచేసేలాగే చూపిద్దామని అనుకున్నామని.. కానీ తన అసిస్టెంట్ తన పర్యటనలో భాగంగా మొక్కజొన్న పంటకు సంబంధించిన పొలాల ఫొటోలు తీసి పంపాడని.. అది చూశాక తాను ఎగ్జైట్ అయి దానికే ఓకే చెప్పానని సుకుమార్ వెల్లడించాడు. ఇక సినిమాలో పదే పదే చూపించే గడ్డి తోటలకు సంబంధించి దృశ్యాలు కొల్లేరుకు దగ్గర్లో ఉన్నాయని.. కొన్ని కిలోమీటర్ల దూరం అవి విస్తరించాయని.. అవి తనకు తెగ నచ్చేయడంతో సినిమాలో ముందు అనుకున్న వాటి కంటే ఎక్కువ సీన్లను ఆ ప్రదేశంలో చిత్రీకరించినట్లు సుకుమార్ వెల్లడించాడు. సినిమాలో అదొక పాత్ర లాగా జనాలకు గుర్తుండిపోయిందని సుకుమార్ అన్నాడు.
Tags:    

Similar News