ఆమెను సుకుమారే రక్షించాలి

Update: 2015-10-26 15:30 GMT
స్టార్ డమ్ సంపాదించడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ఓ దర్శకుడైనా.. హీరో అయినా.. హీరోయిన్ అయినా .. ఓ తమకంటూ ఓ గుర్తింపు సంపాదించాక ప్రేక్షకులు వాళ్ల మీద అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాల్ని ప్రతిసారీ అందుకోకపోయినా ఎంతో కొంత కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ విషయంలో దర్శకులు, హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఉన్న అవకాశం తక్కువే. అయినప్పటికీ ఓ విలక్షణత, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండటం కంపల్సరీ.

గత ఆరేడేళ్లుగా తెలుగు తెరను ఏలుతూ వచ్చిన కాజల్ - సమంత - తమన్నాల్లో ఈ విలక్షణత కనిపిస్తుంది. తమ పాత్ర ఎలా ఉన్నా.. అందులో తమ స్క్రీన్ ప్రెజెన్స్ తోనో.. ఇంకేదైనా ప్రత్యేకతతోనో తమదైన ముద్ర వేయడంలో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు మంచి గుర్తింపే సంపాదించారు. అందుకే కెరీర్ లో ఫ్లాపులు ఎదురైనా, పాత్రలు బాలేకున్నా.. ఇంత కాలం మనుగడ సాగించారు. ఇప్పటికీ హవా సాగిస్తున్నారు.

ఐతే ఈ ముగ్గురి తర్వాత స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇంకా తనకంటూ ఓ ప్రత్యేకత సాధించలేకపోయింది. తెలుగులో ఆమెకు మంచి విజయంతో పాటు గుర్తింపు తెచ్చిపెట్టిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మినహాయిస్తే ఇంకే సినిమాలోనూ రకుల్ చెప్పుకోదగ్గ పాత్రలు చేయలేకపోయింది. ఐతే దర్శకులు అలాంటి పాత్రలిస్తే ఆమె ఏం చేయగలదు అనేయొచ్చు. కానీ ఓ హీరోయిన్ పెర్ఫామెన్స్ - బాడీ లాంగ్వేజ్ - యాక్టింగ్ స్కిల్స్ ను బట్టే డైరెక్టర్లు కూడా పాత్రలు డిజైన్ చేస్తారు. ఓ హీరోయిన్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటే.. దానికి తగ్గట్లు పాత్రలు డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.

కాబట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటేనే రకుల్ పైన చెప్పుకున్న ముగ్గురిలా సుదీర్ఘ కాలం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవించగలదు. ఐతే ఇప్పటిదాకా చేసిన సినిమాల సంగతి వదిలేద్దాం. ఇకపై రకుల్ సినిమాల్లో ఆమె పాత్రలు ఎలా ఉంటాయో చూడాలి. సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో పని చేస్తుండటం ఆమె అదృష్టమే. ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. రకుల్ కోరుకుంటున్న గుర్తింపు సుక్కునే తెచ్చిపెట్టాలి మరి.
Tags:    

Similar News