హీరో మాట: ఏపీలో కేసీఆర్ హీరో

Update: 2016-11-30 11:04 GMT
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత పెద్ద విలన్ గా చూశారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు వ్యతిరేకంగా స్థానికంగా పెద్ద ఉద్యమమే నడిచింది. సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ వ్యతిరేక ప్రచారం గట్టిగానే జరిగింది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న విభజనకు కేసీఆరే కారణం అంటూ అక్కడి జనాలు విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూడా తనను ఆంధ్రా జనాలు ఎలా తిడుతున్నారో సభల్లో చెప్పాడు. ఐతే అప్పటి సంగతేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఏపీ జనాలు కేసీఆర్ ను హీరోలాగా చూస్తున్నారని అంటున్నాడు సీనియర్ నటుడు సుమన్. కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని సుమన్ వ్యాఖ్యానించాడు.

కొంత కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్న సుమన్.. విభజన కోసం కేసీఆర్ దీక్షకు దిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్ష చేయని పక్షంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష కీలక మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు కూడా మంచే జరిగిందని.. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి విభజన తర్వాత అక్కడ జరుగుతోందని.. అందుకే అక్కడి జనాలు కేసీఆర్ ను హీరోలాగా చూస్తున్నారని.. విభజన విషయంలో ఆయనకు రుణపడి ఉంటామని అంటున్నారని సుమన్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News